ఐపీఎల్ బెట్టింగ్ రూ.100 కోట్లు | rs.100 crore betting for IPL in medak district | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ బెట్టింగ్ రూ.100 కోట్లు

Published Tue, Apr 19 2016 2:29 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

ఐపీఎల్ బెట్టింగ్ రూ.100 కోట్లు - Sakshi

ఐపీఎల్ బెట్టింగ్ రూ.100 కోట్లు

సిద్దిపేట రూరల్: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫోర్లు.. సిక్సర్ల హోరుతో జోరందుకుంది. బెట్టింగ్ కూడా అదే స్థాయిలో లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరింది. ఇటీవల ముగిసిన టీ-20 వరల్డ్ కప్‌లో మెదక్ జిల్లాలో రోజూ రూ.లక్షల్లో బెట్టింగ్ జరిగితే... ఐపీఎల్‌లో రూ. 2 కోట్ల మేర బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం.

బెట్టింగ్ తీరిది...
వరల్డ్‌కప్‌లో అయితే ఇండియా ఆడే మ్యాచ్‌లపై ఎక్కువగా బెట్టింగ్ నడుస్తుంది. కానీ, ఐపీఎల్‌లోని 8 జట్లలోనూ ఇండియా ఆటగాళ్లు ఉంటారు. దీంతో ప్రతీమ్యాచ్‌పైనా బెట్టింగ్ దందా ఉంటోంది. ఐపీఎల్ ప్రధానంగా నాలుగు జట్లు ఫెవరేట్‌గా ఉన్నాయి. బెట్టింగ్‌లో ప్రత్యర్థి జట్లుపై అధికంగా బెట్టింగ్ కాస్తారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్‌లో భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో ఇవి ఫెవరేట్ టీంలుగా బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. ఫేవరేట్ జట్ల మధ్య బెట్టింగ్ జోరుగా నడుస్త్తోంది.

మరో నెల రోజులు ఇదే తీరు..
ఈ నెల 8న ప్రారంభమైన ఐపీఎల్ 45రోజుల పాటు జరగనుంది.మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమైంది. భారీ స్కోర్లు లేవు. ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదారాబాద్ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావడంతో బెట్టింగ్ జోరందుకుంది. ఈ మ్యాచ్‌లో చాలా మంది హైదరాబాద్‌పై పందేలు కాశారు. అయితే ఆర్‌సీబీ గెలవడంతో భారీగా బెట్టింగ్ రాయుళ్లు జేబులు ఖాళీ చేసుకున్నారు. ఇప్పటి వరకూ రోజు ఒక మ్యాచ్ మాత్రమే నేటి నుంచి రోజుకు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో జిల్లాలో రోజూ సుమారుగా రూ. 3కోట్లు మేర బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. లీగ్ మొత్తంపైన జిల్లాలో దాదాపు రూ. 100 కోట్ల మేర చేతులు మారే అవకాశం ఉందని అంచనా.

ఈ ప్రాంతాల్లో బెట్టింగ్ అధికం...
మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, తుప్రాన్, పటాన్‌చెరువు, జహీరాబాద్, రాంచంద్రానగర్, జోగిపేట ప్రాంతాల్లో బెట్టింగ్‌లు పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు తెలుస్తోంది. బుకీలు ఈ ప్రాంతాల్లో మకాం వేశారు. కొంతమంది ఏజెంట్లను ఆయా ప్రాంతాల్లో నియమించుకున్నారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు బెట్టింగ్ తీరును చెప్పేస్తారు. ఈ మేరకు బెట్టింగ్ రాయుళ్లు ఏజెంట్లకు డబ్బులు ఇస్తారు. వీరు సబ్‌బుకీలకు చెల్లిస్తారు. మ్యాచ్ అనంతరం వెంటనే బెట్టింగ్ డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల వల్ల చాలా మంది నష్టపోతున్నారు.

రోడ్డున పడుతున్న కుటుంబాలు...
ఇటీవల వరంగల్ జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ప్రాంతంలో నిర్వహించే బెట్టింగ్‌లో రూ.1.50 లక్షలు ఒకే రోజు పొగొట్టుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. లాడ్జీలు, దాబాలు, ఇంటర్నెట్‌లు, మోబైల్ షాపుల్లో ఈ దందా నడుస్తోంది. బెట్టింగ్ ఎవరు, ఎక్కడ నిర్వహిస్తున్నారనేది స్థానిక పోలీసులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

నిఘా ఉంచాం...:
సిద్దిపేట పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పట్టణ పరిధిలో 10మంది బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిపై ఇప్పటికే నిఘా పెట్టాం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆన్‌లైన్, సెల్‌ఫోన్‌ల ద్వారా బెట్టింగ్‌లు నడిపిస్తుండడం వల్ల పట్టుకోలేకపోతున్నాం. బాధితులెవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. వారికి పొగొట్టుకున్న డబ్బులు ఇప్పించడంతో పాటు వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇస్తే హైదరాబాద్ నుంచి బెట్టింగ్ నడిపిస్తున్న అక్కడి పోలీసుల సాయంతో పట్టుకుంటాం.
- సీహెచ్. శ్రీధర్, డీఎస్పీ సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement