రూ.5 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం
రూ.5 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం
Published Tue, Sep 6 2016 8:41 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM
పేరేచర్ల: మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్‌లో సోమవారం ప్రత్యేక పోలీసు విభాగం నిర్వహించిన దాడులలో రూ.5 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఇటీవల కాలంలో గుట్కాల విక్రయం జోరుగా కొనసాగుతోంది. దీనిపై ప్రజలు పలుమార్లు పోలీసు అధికారులకు ఫిర్యాదుచేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదన కోనం గుట్కా వ్యాపారాన్ని కొంతమంది అక్రమార్కులు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు అర్బన్ ప్రత్యేక పోలీసు విభాగం పక్కా సమాచారంతో సోమవారం పేరేచర్లలో సోదాలు నిర్వహించారు. నాలుగు ప్రాంతాలలో సోదాలు నిర్వహించగా స్థానిక పేరేచర్ల జంక్షన్‌లోని బైరపనేని సాంబశివరావు కాంప్లెక్స్‌లోని ఒక గౌడౌన్‌లో 68 బస్తాలు, సుమారు రూ.5 లక్షల విలువ కలిగిన గుట్కా ప్యాకెట్లను దాడులలో స్వాధీనం చేసుకున్నారు. దాడులలో పట్టుబడిన గుట్కాలను మేడికొండూరు సీఐ బాలాజీ పర్యవేక్షణలో మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న పేరేచర్లకు చెందిన నాదెండ్ల రవి, గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న గుంటూరుకు చెందిన బూస వెంకటేశ్వర్లు, ఉడత రాజశేఖర్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ తెలిపారు. దాడులలో గుంటూరు అర్బన్ ప్రత్యేక విభాగం ఏఎస్‌ఐ శ్రీహరి, పీసీలు కృపారత్నం, విజయ్, మేడికొండూరు ఎస్‌ఐ బాబురావు, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement