Perecharla
-
గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. మేడికొండూరు మండలం పేరేచర్ల పరిధిలోని డోకిపర్రు వద్ద నిర్వహించనున్న వన మహోత్సవంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాక్షి, అమరావతి : పర్యావరణాన్ని రక్షించడంలో చెట్లు ఎంతగానో దోహద పడతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టినట్టు హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగే వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్న సందర్భంగా మంత్రి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, అధికారులను సభావేదిక, హెలీప్యాడ్ ప్రాంతాల వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలు, ట్రాఫిక్ మళ్లింపు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, సౌత్ డీఎస్పీ కమలాకర్, మేడికొండూరు సీఐ ఆనందరావు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో శనివారం ఉదయం 10.30 గంటలకు పర్యటిస్తున్నారు. మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డులో జరిగే వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 4 వేల మొక్కలు నాటేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 68 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 38 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి అమీనాబాద్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్నినాని, జిల్లా మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణారావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 10.30 గంటలకు చేరుకొని 11.30 గంటల తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు పార్లమెంటరీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ పరిశీలించారు. హెలీప్యాడ్ వద్ద తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బంది -
మృత్యు మార్గం.. ఆ మూలమలుపు..!
ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి తిరిగొచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకులేకుండా పోతుంది. నాలుగింతలు పెరిగిన వాహనాల రద్దీకి తగినట్టుగా పదేళ్లుగా రహదారుల విస్తరణ జరగలేదు. ఫలితంగా నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో రహదారులు ‘మృత్యు మార్గాలు’ మారి రక్తపుటేరులను పారిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితులు అనేకం. సాక్షి, పేరేచర్ల: మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ప్రధాన రహదారుల పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది. రహదారులు విస్తరణకు నోచుకోక పోవటం వలన ఫిరంగిపురం, మేడికొండూరు పరిధిలోని గుంటూరు–కర్నూలు, గుంటూరు–హైదరాబాద్ ప్రధానరహదారుల మీద ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. పెద్ద వాహనాల మితిమీరిన వేగం, మూల మలుపులు, ఇరుకు రోడ్లు, కాలం చెల్లిన బ్రిడ్జిలుతో పాటు అడ్డదారుల్లో వేగంగా వచ్చే టిప్పర్లతో మనిషి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. దీనికి తోడు డివైడర్లు వద్ద ప్రమాద సూచికలు, రేడియం స్టిక్కర్లు లేక పోవటంతో వాహనాల వేగం అదుపు చేయలేక డివైడర్లను ఢీకొట్టి మృత్యువాత పడిన దాఖలాలు ఎన్నో. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వం కొన్నేళ్లుగా పేరేచర్ల నుంచి కొండమోడు వెళ్లే రహదారిని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తామన్న మాట ఆచరణలో కనిపించడం లేదు. ఫిరంగిపురం వైపు వెళ్లే గుంటూరు–కర్నూలు రహదారిని కూడా విస్తరిస్తామని చెప్పినా దాని గురించి పట్టించు కోలేదు. ముఖ్యంగా ఈ మార్గాల గుండా వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీనికి తోడు వేగాన్ని నియంత్రించాల్సిన రవాణాశాఖ చోద్యం చూస్తుండటంతో డ్రైవర్లు మరింత రెచ్చి పోతున్నారు. రెండు మండలాల్లో టిప్పర్లు 500కి పైనే ఉన్నాయి. ఇటీవల హార్స్ పవర్ ఎక్కువగా ఉన్న టిప్పర్ల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడపడంతో పాటు కార్లు, ట్రాలీ ఆటో వాలాలు ఎదురుగా ఉన్న వాహనాలను వేగంతో ఓవర్ టేక్ చేస్తూ భయపెడుతున్నారు. అధిక సంఖ్యలో ప్రమాదాలు మేడికొండూరు పరిధిలోని పేరేచర్ల నుంచి కొర్రపాడు ఉన్నత పాఠశాల వరకు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పేరేచర్ల ఫైల్ ఓవర్‌తో పాటు జోసిల్ కంపెనీ, డోకిపర్రు అడ్డరోడ్డు, సబ్‌స్టేషన, మేడికొండూరు పరిధిలోని కోల్డ్‌స్టోరేజీ, ఈద్గా సమీపంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక ఫిరంగిపురం పరిధిలోని కారం మిల్లు నుంచి పొనుగుపాడు వరకు ఉన్న 19.5 కిలోమీటర్ల రహదారి ఉంది. 3 కిలోమీటర్లు నాదెండ్ల పరిధి పోనూ 16.5 కిలోమీటర్లు ఫిరంగిపురం లోకి వస్తుంది. ఇందులో 4.6 కిలోమీటర్ల రహదారి అత్యంత ప్రమాదకరంగా గుర్తించారు. దీని మధ్యలో వేములూరిపాడు, రేపూడి, వేమవరం క్రాస్ తగులుతాయి. కేవలం నాలుగేళ్లలో ఈ రహదారిలో 50కి పైగా ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడ్డారు. మేడికొండూరు మండలంలో.. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2013 47 26 21 2014 51 29 22 2015 57 32 25 2016 49 25 24 2017 48 35 13 2018 42 18 34 ఫిరంగిపురం పరిధిలో .. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2015 20 10 10 2016 20 13 7 2017 28 13 15 2018 32 11 21 -
పేరేచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
* భార్యాభర్తల మృతి మేడికొండూరు : మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్ ఫ్లై ఓవర్‌పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన భార్య, భర్త మృతిచెందారు. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు గ్రామానికి చెందిన గేరా బాలస్వామి(50), భార్య థామసమ్మ (45) మంగళవారం పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తిరిగి స్వగ్రామమైన నల్లపాడు తిరిగి బైక్‌పై వస్తుండగా పేరేచర్ల గుంటూరు రోడ్డులోని ఫ్లైఓవర్ ఎక్కుతుండగా గుంటూరు నుంచి పేరేచర్ల వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రహదారిపై పడిపోయింది. అదే సమయంలో పేరేచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనంపై ఎక్కడంతో వాహనంపై ఉన్న భార్యభర్త అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలానికి చేరుకున్న బంధువుల కుటుంబ సభ్యులు రోదనలు విని స్థానికులు కలత చెందారు. మేడికొండూరు సీఐ బాలాజీ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు సమగ్ర ఆస్పత్రికి తరలించారు. ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. -
పూర్తి ఆధిక్యంలో ముంబయి జట్టు
గుంటూరు స్పోర్ట్స్ : పేరేచర్లలోని ఏసీఏ, నరేంద్రనాథ్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న డి.వి.సుబ్బారావు మెమోరియల్ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతునాయి. శుక్రవారం అట ముగిసే సమయానికి ముంబయి జట్టు 248 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. శనివారం తొలి ఇన్నింగ్ ప్రారంభించిన కర్నాటక జట్టు 32 ఓవర్లలో కేవలం 52 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్ ప్రారంభించిన ముంబయి జట్టు రెండో రోజు అట ముగిసే సమయానికి 58 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. -
రూ.5 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం
పేరేచర్ల: మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్లో సోమవారం ప్రత్యేక పోలీసు విభాగం నిర్వహించిన దాడులలో రూ.5 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఇటీవల కాలంలో గుట్కాల విక్రయం జోరుగా కొనసాగుతోంది. దీనిపై ప్రజలు పలుమార్లు పోలీసు అధికారులకు ఫిర్యాదుచేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదన కోనం గుట్కా వ్యాపారాన్ని కొంతమంది అక్రమార్కులు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు అర్బన్ ప్రత్యేక పోలీసు విభాగం పక్కా సమాచారంతో సోమవారం పేరేచర్లలో సోదాలు నిర్వహించారు. నాలుగు ప్రాంతాలలో సోదాలు నిర్వహించగా స్థానిక పేరేచర్ల జంక్షన్‌లోని బైరపనేని సాంబశివరావు కాంప్లెక్స్‌లోని ఒక గౌడౌన్లో 68 బస్తాలు, సుమారు రూ.5 లక్షల విలువ కలిగిన గుట్కా ప్యాకెట్లను దాడులలో స్వాధీనం చేసుకున్నారు. దాడులలో పట్టుబడిన గుట్కాలను మేడికొండూరు సీఐ బాలాజీ పర్యవేక్షణలో మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న పేరేచర్లకు చెందిన నాదెండ్ల రవి, గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న గుంటూరుకు చెందిన బూస వెంకటేశ్వర్లు, ఉడత రాజశేఖర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ తెలిపారు. దాడులలో గుంటూరు అర్బన్ ప్రత్యేక విభాగం ఏఎస్ఐ శ్రీహరి, పీసీలు కృపారత్నం, విజయ్, మేడికొండూరు ఎస్ఐ బాబురావు, సిబ్బంది ఉన్నారు.