పేరేచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
* భార్యాభర్తల మృతి
మేడికొండూరు : మండల పరిధిలోని పేరేచర్ల జంక‌్షన్ ఫ్లై ఓవర్‌పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన భార్య, భర్త మృతిచెందారు. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు గ్రామానికి చెందిన గేరా బాలస్వామి(50), భార్య థామసమ్మ (45) మంగళవారం పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తిరిగి స్వగ్రామమైన నల్లపాడు తిరిగి బైక్‌పై వస్తుండగా పేరేచర్ల గుంటూరు రోడ్డులోని ఫ్లైఓవర్ ఎక్కుతుండగా గుంటూరు నుంచి పేరేచర్ల వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రహదారిపై పడిపోయింది. అదే సమయంలో పేరేచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనంపై ఎక్కడంతో వాహనంపై ఉన్న భార్యభర్త అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలానికి చేరుకున్న బంధువుల కుటుంబ సభ్యులు రోదనలు విని స్థానికులు కలత చెందారు. మేడికొండూరు సీఐ బాలాజీ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు సమగ్ర ఆస్పత్రికి తరలించారు. ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.