ఆదివారం మేడికొండూరులో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్, రేపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు(ఫైల్)
ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి తిరిగొచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకులేకుండా పోతుంది. నాలుగింతలు పెరిగిన వాహనాల రద్దీకి తగినట్టుగా పదేళ్లుగా రహదారుల విస్తరణ జరగలేదు. ఫలితంగా నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో రహదారులు ‘మృత్యు మార్గాలు’ మారి రక్తపుటేరులను పారిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితులు అనేకం.
సాక్షి, పేరేచర్ల: మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ప్రధాన రహదారుల పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది. రహదారులు విస్తరణకు నోచుకోక పోవటం వలన ఫిరంగిపురం, మేడికొండూరు పరిధిలోని గుంటూరు–కర్నూలు, గుంటూరు–హైదరాబాద్ ప్రధానరహదారుల మీద ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. పెద్ద వాహనాల మితిమీరిన వేగం, మూల మలుపులు, ఇరుకు రోడ్లు, కాలం చెల్లిన బ్రిడ్జిలుతో పాటు అడ్డదారుల్లో వేగంగా వచ్చే టిప్పర్లతో మనిషి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. దీనికి తోడు డివైడర్లు వద్ద ప్రమాద సూచికలు, రేడియం స్టిక్కర్లు లేక పోవటంతో వాహనాల వేగం అదుపు చేయలేక డివైడర్లను ఢీకొట్టి మృత్యువాత పడిన దాఖలాలు ఎన్నో.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ప్రభుత్వం కొన్నేళ్లుగా పేరేచర్ల నుంచి కొండమోడు వెళ్లే రహదారిని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తామన్న మాట ఆచరణలో కనిపించడం లేదు. ఫిరంగిపురం వైపు వెళ్లే గుంటూరు–కర్నూలు రహదారిని కూడా విస్తరిస్తామని చెప్పినా దాని గురించి పట్టించు కోలేదు. ముఖ్యంగా ఈ మార్గాల గుండా వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీనికి తోడు వేగాన్ని నియంత్రించాల్సిన రవాణాశాఖ చోద్యం చూస్తుండటంతో డ్రైవర్లు మరింత రెచ్చి పోతున్నారు. రెండు మండలాల్లో టిప్పర్లు 500కి పైనే ఉన్నాయి. ఇటీవల హార్స్ పవర్ ఎక్కువగా ఉన్న టిప్పర్ల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడపడంతో పాటు కార్లు, ట్రాలీ ఆటో వాలాలు ఎదురుగా ఉన్న వాహనాలను వేగంతో ఓవర్ టేక్ చేస్తూ భయపెడుతున్నారు.
అధిక సంఖ్యలో ప్రమాదాలు
మేడికొండూరు పరిధిలోని పేరేచర్ల నుంచి కొర్రపాడు ఉన్నత పాఠశాల వరకు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పేరేచర్ల ఫైల్ ఓవర్‌తో పాటు జోసిల్ కంపెనీ, డోకిపర్రు అడ్డరోడ్డు, సబ్‌స్టేషన, మేడికొండూరు పరిధిలోని కోల్డ్‌స్టోరేజీ, ఈద్గా సమీపంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక ఫిరంగిపురం పరిధిలోని కారం మిల్లు నుంచి పొనుగుపాడు వరకు ఉన్న 19.5 కిలోమీటర్ల రహదారి ఉంది. 3 కిలోమీటర్లు నాదెండ్ల పరిధి పోనూ 16.5 కిలోమీటర్లు ఫిరంగిపురం లోకి వస్తుంది. ఇందులో 4.6 కిలోమీటర్ల రహదారి అత్యంత ప్రమాదకరంగా గుర్తించారు. దీని మధ్యలో వేములూరిపాడు, రేపూడి, వేమవరం క్రాస్ తగులుతాయి. కేవలం నాలుగేళ్లలో ఈ రహదారిలో 50కి పైగా ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడ్డారు.
మేడికొండూరు మండలంలో..
సంవత్సరం | ప్రమాదాలు | మృతులు | క్షతగాత్రులు |
2013 | 47 | 26 | 21 |
2014 | 51 | 29 | 22 |
2015 | 57 | 32 | 25 |
2016 | 49 | 25 | 24 |
2017 | 48 | 35 | 13 |
2018 | 42 | 18 | 34 |
ఫిరంగిపురం పరిధిలో ..
సంవత్సరం | ప్రమాదాలు | మృతులు | క్షతగాత్రులు |
2015 | 20 | 10 | 10 |
2016 | 20 | 13 | 7 |
2017 | 28 | 13 | 15 |
2018 | 32 | 11 | 21 |
Comments
Please login to add a commentAdd a comment