
గ్యాస్ భారం
సబ్సిడీ సిలిండర్ ధరపై రూ.90 పెంపు నేటి నుంచి అమలు
జిల్లావాసులపై నెలకు రూ.86 కోట్లు అదనపు భారం
పెంచిన మొత్తం సబ్సిడీ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటన
చిత్తూరు(కార్పొరేషన్): జిల్లావాసులపై కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌బండ భారాన్ని మరింతగా మోపింది. సబ్సిడీ సిలిండర్‌పై ఏకంగా రూ.90 ధర పెంచడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెంచిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో తిరిగి ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే సబ్సిడీ సక్రమంగా జమకాక ఇబ్బంది పడుతున్న తమకు కేంద్రం తాజా నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు ఖాయమని జనం వాపోతున్నారు. ప్రసుత్తం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.738 ఉండగా అది రూ.828కు పెరిగింది. అయితే పెంచిన మొత్తాన్ని ఖాతాల్లో సబ్సిడీ రూపంలో జమచేయనున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లావాసుల పై నెలకు రూ.86 కోట్లకు వరకు అదనపు భారం పడనుంది. గ్యాస్‌ధర పెంపు నిర్ణయం గురువారం నుంచి అమలులోకి రానుంది. అయితే బుధవారం కేంద్రం ప్రకటన చేసిన వెంటనే డీలర్లు రూ.850కు సిలిండర్లను విక్రయించారు. ఇదేంటని ప్రశ్నిస్తే రేటు పెరిగిందని సమర్థించుకుంటున్నారు.
తొమ్మిదిన్నర లక్షల మందిపై భారం..
జిల్లా జనాభా 42 లక్షలు ఉండగా ఇందులో 9,58,786 మంది సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. 90 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా 2,800 మంది నాన్ సబ్సిడీ సిలిండర్లను,3200 మంది వాణిజ్య అవసరాల సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఈ లెక్కన 9,58,786 మంది వినియోగదారులపై నెలకు అదనంగా రూ.86 కోట్లు వ్యయం వేశారు. ఈ మొత్తం ఖాతాల్లో జమచేస్తామని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్లపై రూ.148.50 పెంచారు. ఆ లెక్కన ప్రతినెలా అదనంగా మరో రూ.10 లక్షలు భారం పడనుంది. ఇది వరకు రూ.738 ఉన్న సిలిండర్‌ను రూ.760కు విక్రయించగా ఇకపై అది రూ.828కి చేరనుంది. డెలివరీతో పాటు రూ.850 వరకు వసూలు చేస్తారు.
బుధవారమే దోపిడీ
నూతనంగా పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయి. కానీ డీలర్లు బుధవారం కూడా రూ.850(హోమ్ డెలీవరీ) వసూలు చేశారు. ఈ లెక్కన రోజులోనే లక్షలాది రూపాయలు దోచుకున్నారని వినియోగదారులు వాపోయారు.