గుట్కా గుట్టురట్టు
- రూ.50 లక్షల విలువైన గుట్కా, సామగ్రి పట్టివేత
- - బల్లేపల్లి సమీపంలోని మామిడి తోటలో విజిలెన్స్ దాడులు
- - నిర్వాహకులతో సహా 13 మంది కూలీల అరెస్ట్
- - వాహనాలు, యంత్రాలు స్వాధీనం
- - రెండు రాష్ట్రాలకు సరఫరా: విజిలెన్స్ విభాగం అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి
- జిల్లా కేంద్రంలో అంతర్భాగంగా ఉన్న బల్లేపల్లి సమీపంలోని మామిడి తోటలో రూ.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకు, యంత్రాలను మంగళవారం అర్ధరాత్రి వరంగల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆశాఖ అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం అర్బన్/ఖమ్మం రూరల్:
బల్లేపల్లికి చెందిన మలీదు జగన్ మామిడి తోటలో పాత కోళ్ల ఫారం షెడ్ ఉంది. దీనిలో విజయవాడకు చెందిన బంటి అలియాస్ కుల్‌దీప్‌శర్మ, అతని మిత్రుడు జమలాపురం శ్రీనివాస్, ఎస్డీ ఆరిప్, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గుట్కా తయారీ యూనిట్‌ను నెలకొల్పారు. జగన్‌కు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని షెడ్‌ను అద్దెకు తీసుకొని సుమారు నెలరోజులుగా ఈ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 9 మంది కూలీలను తీసుకొచ్చి గుట్కా ప్యాకెట్లు తయారు చేయిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ముడిసరుకు, దానిలో కలిపే లిక్విడ్‌ను తీసుకొచ్చి షెడ్‌లో ఉన్న మిషన్ ద్వారా మిక్సింగ్ చేస్తున్నారు. గుట్కా తయారు అయ్యాక ప్యాకింగ్ చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంగళవారం సాయంత్రం నుంచి మామిడితోట సమీపంలో మాటు వేసి అర్ధరాత్రి దాడులు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. అప్పుడే అక్కడికి తెచ్చిన గుట్కా తయారీకి ఉపయోగించే లిక్విడ్‌ను, ఒక సఫారీ కారు, ట్ర్యాలీ వ్యాన్, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వాహనాల ద్వారా నిత్యం ముడి సరుకు తీసుకొచ్చి.. తయారైన ప్యాకెట్‌లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. షెడ్డులో 5 ప్యాకింగ్ యంత్రాలతో పాటు సీఎం 1000 బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న సుమారు 5 లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ప్యాకెట్లను చిన్నచిన్న బస్తాలలో నింపి రెండు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు లక్షల గుట్కా ప్యాకెట్ల విలువ రూ.25,29,800 ఉంటుందని వివరించారు. యంత్రాలు, వాహనాలు, ముడిసరుకు మొత్తం కలిసి రూ.50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో అదనపు ఎస్పీతో పాటు వరంగల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ ఎన్.వెంకారెడ్డి, సీఐ ఎన్. వెంకటేష్, ఏఓ జి. సారయ్య, కానిస్టేబుల్ పి.సురేష్ పాల్గొన్నారు.