కాపుల సహనాన్ని పరీక్షించవద్దు
– పదవులు తృణ ప్రాయమే..ఉద్యమానికి సన్నద్ధం
– తేల్చిచెప్పిన ఆర్టీఐ కమిషనర్ విజయ్‌బాబు
అనంతపురం న్యూటౌన్ : ‘ న్యాయమైన కోరికను కాపులు అడుగుతుంటే అడుగడుగునా రాజకీయాలు చేస్తూ కాపుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఉద్యమానికి సన్నద్ధం కావడమే ఇక మిగిలింది’ అంటూ ఆర్టీఐ కమిషనర్ విజయ్‌బాబు అన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండుతో ఉద్యమానికి సిద్ధమవుతున్న కాపులు జిల్లా స్థాయి జేఏసీలను ఏర్పాటు చేసుకున్నారు. కేటీబీ రాష్ట్ర నాయకులు జంగటి అమరనాథ్ నేతృత్వంలో గురువారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆర్టీఐ కమిషనర్ విజయ్‌బాబు మాట్లాడుతూ కాపుల మంచితనాన్ని చేతకాని తనంగా చూస్తున్నారని ఇకపై ప్రభుత్వ దమననీతిని సహించేది లేదని తేల్చిచెప్పారు.
తమకు పదవులు తృణప్రాయమని, ఉద్యమానికి బాసటగా ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. సమైక్యంగా ఉంటేనే ఉద్యమాలు అనుకున్న లక్ష్యం చేరుకుంటాయని విబేధాలు మాని అందరం ఒక తాటిపై నడవాలని సూచించారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేవీ రావు , రిటైర్డ్ డీజీపీ ఎమ్వీ కృష్ణారావు, రాష్ట్ర కాపు జేఏసీ నేతలు తేలపల్లి రాఘవయ్య, పీవీఎస్ మూర్తి, నారాయణరెడ్డి తదితరులు కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాపులపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని అవలంభించడం మంచిది కాదని హితువు పలికారు. ఈనెల 11న రాజమండ్రి వేదికగా కాపులు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా కాపు నాయకులు మల్లికార్జున, రామగోపాల్, విజయ్‌శేఖర్, భాస్కర్, గుజరీ వెంకటేష్, రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు తదితరులు మాట్లాడారు.
జిల్లా జేఏసీ ప్రమాణ స్వీకారం
ఉద్యమ బాటలో నడవడానికి సిద్ధం కావాలన్న రాష్ట్ర జేఏసీ నేతల పిలుపుతో జిల్లా జేఏసీలను ఏర్పాటు చేసిన అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. కాపు జిల్లా జేఏసీ చైర్మన్‌గా పూల వెంకటరమణ, కన్వీనర్‌గా భవానీ రవికుమార్, ఉద్యోగ జేఏసీకి సాయినాథప్రసాద్, లీగల్ జేఏసీకి తుకారాం, యువజన విభాగానికి గల్లా హర్ష, మహిళా విభాగం జేఏసీ వక్కల ఉమ, టీచర్స్ జేఏసీకి రవిశంకర్,భవన నిర్మాణ కార్మిక జేఏసీకి వరభద్ర, విద్యార్థి జేఏసీకి శ్రీనివాసులు తదితరులను కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.