అభిప్రాయం
పల్లెపట్టు శ్రమైక జీవన సౌందర్యాన్ని, సంస్కృతిని రక్తనిష్ఠ మొనర్చుకున్న జానపద కవి బ్రహ్మ కొసరాజు రాఘవయ్య. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, (Harikatha) జముకుల కథలు, బుర్రకథలు, భజన గీతాలు, పగటి వేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, గంగిరెద్దుల గీతాలు... ఇలా అట్టడుగు వర్గాల జీవితాలు ప్రతిబింబించే ఎన్నో పాటలు (Songs) రాశారు. ‘ప్రతిభ ఉన్నా దానికి పదును పెట్టేవారు, ప్రోత్సహించేవారు లేకపోతే ఏం ఉపయోగం?’ అనేవారు ఆయన తనను ఆ స్థాయికి ప్రోత్సహించిన వారిని తలుచుకుంటూ.
కొసరాజు రాఘవయ్య (Kosaraju Raghavaiah) నాలుగో తరగతి వరకు చదివారు. పైచదువులకు వెళ్లలేకపోయారు. అదృష్టవశాత్తు ఆయన కొండముది నరసింహ పంతులు దృష్టిలో పడ్డారు. ఆయన శిష్యరికంలో రాటుతేలారు. ఆ తర్వాత కవిత్వం రాస్తూ, రైతులు, వివిధ జాన పదుల జీవితాలను అధ్యయనం చేశారు. తన పేరు చివర ఉన్న ‘చౌదరి’ తొలగించుకున్నారు. మొదటగా ‘రైతుబిడ్డ’ చిత్రానికి పాటలు రాసి ఆ తర్వాత ప్రోత్సాహం లేక మద్రాసు (Madras) నుంచి స్వగ్రామం వెళ్లిపోయి వ్యవసాయం చేసుకున్నారు. అయితే ఆయన కలం పదును గురించి కేవీ రెడ్డికి డీవీ నరసరాజు చెప్ప డంతో ఆయన్ని మద్రాసుకు పిలిపించి 1954లో విడుదలైన పెద్దమనుషుల చిత్రానికి పాటలు రాయించారు.
ఆ విధంగా 13 ఏళ్ల తర్వాత రెడ్డిగారి ప్రోత్సాహంతో సినిమాలలో బిజీ కవి అయిపోయారు కొసరాజు. మొత్తం 350 చిత్రాలకు గాను 3 వేల పాటలు రాశారు. అటువంటి గొప్ప కవిని ఆ ఇంటి పేరు గలవారు ‘కొసరాజు వారి వంశవృక్ష సేవా సమితి’ పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నిజానికి గొప్ప వ్యక్తులను స్మరించుకోవడానికి ఏ పేరుతో ఎవరు సమావేశాలు నిర్వహించినా హర్షణీయమే. అయితే ఆ సభల్లో ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలాంటి సభల్ని ‘సభాకల్పతరుర్భాతి’ అంటారు. ధర్మసభల్లో మాట్లాడవలసిన రీతిని, భారతంలో పూరునికి యయాతి బోధించే విధానం నన్నయ ఇలా చెప్తాడు:
‘మనమునకు ప్రియంబును, హితమును పద్యము దద్యమును నమోఘ మధురంబును, పరిమితమును నగు పలుకొనరగా పలుకునది ధర్మయుతముగా సభలన్. ధర్మయుతమైన సభల్లో మనం మాట్లాడే మాటలు తోటి వారికి ప్రియం కలిగించాలి. హితంగా, మితంగా, ఇంపుగా, ఎదుటివారు నొచ్చుకోని విధంగా, మెచ్చుకునే విధంగా ఉండాలి అంటాడు.
‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితంచయాత్ / స్వాధ్యాయభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే! ‘మాటలు ఉద్వేగం కలిగించనవి, ఆగ్రహం పుట్టించనవి, ప్రయోజనకరంగా ఉండేవి, వాక్ సంబంధమైన తపస్సు లాంటివి’ అని భగవద్గీత ప్రబోధిస్తోంది. కానీ జనవరి 19న విజయవాడలో నిర్వహించిన కొసరాజు స్మృతి సభలో జరిగిందేమిటి? ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడిందేమిటి?
విషతుల్యమైన మస్తిష్కంతో, ఛద్మ వేషధారణతో కనీసం సాహితీ పరిజ్ఞానం లేని కుల నాగులను పిలిపించి మాట్లాడితే ఏం జరుగుతుందో అదే ఆ సభలో జరిగింది. ఆ సభ ఔచిత్యం ఏమైపోయింది? చివరికి బాకా పత్రికల్లో సైతం విషవాక్యాలే వార్తగా వచ్చాయి తప్ప కొసరాజు గురించి కొసరు వార్త కూడా లేదు. కొసరాజు వంశస్థులు ఒక్కసారి ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక గొప్ప కవికి కుల పంకిలం అంటించడం నిజమైన నివాళి అవుతుందా? ఆ సభను తమ ఆక్రోశం, కుళ్ళు వెళ్ళబుచ్చుకోవడానికి, కుసంస్కార భాషను ఉపయోగించటం అంటే సభ రభస అయినట్టు కాదా? ఇది కొసరాజుకి నివాళి అవుతుందా? రాజకీయ ప్రత్యర్థుల్ని తమ పోలీసు భాషతోనో, తమ కుల దురహంకార భాషతోనో తిట్టాలనుకుంటే డైరెక్ట్‌గా కులసభలే పెట్టుకోవచ్చు. కొసరాజు పేరు ఎందుకు?
చదవండి: కాంతి లేని కూటమి పాలన
నార్ల వెంకటేశ్వరరావు, దేవరకొండ బాలగంగాధర తిలక్, వాసిరెడ్డి సీతాదేవి, కొసరాజు రాఘవయ్య వంటి సాహితీ మూర్తులను కుల దృక్కోణం నుంచి చూడటం వారి సభలకు కులనాగులను పిలిపించి ఆ సభకు సంబంధం లేని వ్యక్తుల మీద విషం చిమ్మించటం సబబేనా? ఒక పరి ఆలోచించండి!
- పి. విజయబాబు
సీనియర్ సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment