సాక్షి,సిటీబ్యూరో: ఏక్షణాన్నయినా కూలే ప్రమాదం ఉన్న పురాతన, శిథిల భవనాల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో తమ చర్యలను మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా శిథిల భవనాలతోపాటు, బీఆర్‌ఎస్‌కు నిర్ణీత గడువు ముగిశాక నిర్మించిన అక్రమ భవనాలను కూల్చి వేస్తున్నారు.
శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, నివాసితులకు నోటీసులు జారీ చేశారు. పురాతన భవనాల్లో కొనసాగుతున్న రామ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్, యూసుఫ్‌గూడ పోలీస్‌క్వార్టర్స్‌లకు కూడా నోటీసులు అందజేశారు. గత రెండు వారాల్లో 132 భవనాలను కూల్చివేసిన అధికారులు 23 భవనాల్లోని వారిని ఖాళీ చేయించారు.
మరో 31 భవనాల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే 48 శిథిల భవనాలను కూల్చివేశారు. 12 భవనాలను స్వచ్ఛందంగా ఖాళీచేసి సహకరించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఒక భవనాన్ని సీజ్ చేశామన్నారు.