3వ ర్యాంకు సాధించిన ఎం.శ్రీనివాసులు
గ్రామీణ అభ్యర్థుల హవా!
Published Sat, May 13 2017 9:43 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
- కానిస్టేబుల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
- జిల్లా టాపర్‌గా నాన్‌లోకల్ అభ్యర్థి
- డి.హాసన్, ఎం.శ్రీనివాసులుకు 2, 3 ర్యాంకులు
- పేదింటికి చెందిన మహేష్‌కు 9వ ర్యాంకు
కర్నూలు సిటీ: పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సత్తా చాటారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఈ విషయం రుజువైంది. జిల్లాలో 180 సివిల్, 35 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలకు గతేడాది నవంబరు 8న ప్రిలీమనరీ, ఈ ఏడాది జనవరి 17వ తేదిన మెయిన్స్ పరీక్షలు జరిగాయి. కడప జిల్లాకు చెందిన డి.శ్రీధర్‌రెడ్డి 154 మార్కులతో నాన్‌లోకల్ కేటగిరీలో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత డి.హాసన్ బాషా 152 మార్కులతో ద్వితీయ ర్యాంకు, 151 మార్కులతో ఎం.శ్రీనివాసులు మూడో ర్యాంకు సాధించారు. బుడగ జంగాల వర్గానికి చెందిన మహేష్ 9వ ర్యాంకు సాధించారు. కూలీ పనికి పోతేగానీ పూట గడవని స్థితిలోని కుటుంబం, మట్టిని నమ్ముకున్న ఓ రైతు ఇంట పుట్టిన బిడ్డలు పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించారు.
- పాములపాడు మండలం ఎర్రగూడురుకు చెందిన బుడగ జంగం సామాజిక వర్గానికి చెందిన ఎం.గంగన్న, ఎం.జానమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు. గంగన్న వివాహం కాకముందు ఊరూరా తిరుగుతూ సంచార జీవితం గడిపే వారు. జానమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత ఎర్రగూడురులో స్థిరపడ్డారు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించేవారు. అయితే తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన పెద్ద కుమారుడు మధు, కూతురు సుజాత తమ్ముళ్ల చదువు కోసం వారు మధ్యలోనే చదువు మానేశారు. రెండో కుమారుడు ఎం.మహేష్ ప్రస్తుతం కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థాయి 9వ ర్యాంకు సాధించారు. చివరి కొడుకు రాఘవేంద్ర సైతం ఇటీవలే ఆర్మీ ఉద్యోగం సాధించి బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు.
- వెలుగోడు మండలం వెల్పనూరుకు చెందిన మాచర్ల వెంకటరమణ, ఎం.నాగలక్ష్మమ్మ దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. నాలుగెకరాలు భూమి ఉంది. వీరికి ఇద్దరు కూమారులు. పెద్దవాడు ఎం.శ్రీనివాసులు 151 మార్కులు సాధించి జిల్లాలో మూడో ర్యాంకర్‌గా నిలిచారు. ప్రాథమిక చదువంతా వేల్పనూరులో సాగింది. నంద్యాల వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఇంటర్, కడప కె.ఎస్.ఆర్.ఎమ్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.
హోంగార్డు నుంచి కానిసేబుల్ పోస్టుకు ఎంపిక..
పోలీసు శాఖలో హోంగార్డుగా సేవలు అందిస్తున్న వారు సైతం కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. దేవనకొండ మండలం పూల్లాపురం గ్రామానికి చెందిన డి.రామకృష్ణారెడ్డి 2012 నుంచి హోంగార్డుగా పని చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ ఓపెన్ స్కూల్ విధానంలో పూర్తి చేశారు. హోంగార్డుగా పని చేస్తూ కానిస్టేబుల్ పోస్టులకు ఎస్.వి.ఆర్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నాడు. సి.బెళగల్‌కు చెందిన హరిప్రసాద్, పి.ఆంజనేయులు, ఈ.రామన్‌గౌడు తదితరులు కూడా హోంగార్డులుగా పని చేస్తూ సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.
Advertisement
Advertisement