ఆ విషయంలో భారత్ కు 11వ స్థానం!
పూనెః సముద్ర జలాలను శుభ్రపరిచే విషయంలో భారత్ 11వ స్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్ర జలాలనుంచి వెలికి తీసి, తీరాలను శుభ్రపరిచే ఓషన్ క్లీన్ ఆప్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచంలోని 130 దేశాల జాబితాలో ఇండియా పదకొండవ స్థానానికి పరిమితమైంది.
ఓషన్ కన్జర్వెన్సీ దినోత్సవం సందర్భంగా 2015 సెప్టెంబర్ 26న చేపట్టిన ఓషన్ క్లీన్ ఆప్ కార్యక్రమంలో సముద్ర జలాలనుంచి తొలగించిన చెత్త బరువు ఆధారంగా ఇటీవల నైరోబి ర్యాంకులను వెల్లడించింది. ప్రపంచంలోని 130 దేశాల జాబితాలో భారత దేశం 11వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ తీర శుభ్రత కార్యక్రమంలో భాగంగా మొత్తం 8 లక్షల మంది వాలంటీర్లు కలసి సుమారు 80 లక్షల కేజీల వ్యర్థాలను సముద్రం నుంచి వెలికి తీసినట్లు నైరోబి తెలిపింది. ఆయా నగరాల్లోని ఇండియన్ మారిటైం ఫౌండేషన్ సమన్వయంతో భారత దేశంలోని ముంబై, పూనే, గోవా, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, కోటా, సహా పశ్చిమ మరియు ఉత్తర భారత దేశంలోని సమారు 250 మైళ్ళ తీరాన్ని10,800 వాలంటీర్లు శుభ్రం చేసినట్లు తెలిపింది.
ఒక్క తీరాలను శుభ్రం చేయడమే కాక, నదులనుంచి సముద్రాల్లోకి వచ్చే అనేక వ్యర్థాలను క్లీన్ అప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేపట్టామని, అందుకు విద్యార్థులు, కార్పొరేటర్లు, ప్రధాన బ్యాంకులు మద్దతునిచ్చాయని ఇండియా క్లీన్ అప్ కార్యక్రమానికి కో ఆర్డినేట్ గా వ్యవహరించిన కమోడోర్ పవన్ మల్హోత్రా తెలిపారు.