శోక శుక్రవారం
శోక శుక్రవారం
Published Sat, Oct 15 2016 1:18 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
శుక్రవారం నాలుగు కుటుంబాలకు శోకం మిగిల్చింది. వేర్వేరు దుర్ఘటనల్లో నలుగురు మరణించారు. విద్యుదాఘాతానికి ఇద్దరు బలికాగా, కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి.
వరికోత యంత్రం తరలిస్తూ..
ఉంగుటూరు : లారీలో వరి కోత యంత్రాన్ని పొలానికి తరలిస్తుండగా, విద్యుదాఘాతానికి గురై ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఉంగుటూరు మం డలం వెల్లమిల్లి వద్ద శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. వెల్లమిల్లి పంట పొలాల్లో వరి కోత నిమిత్తం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి గురువారం రెండు యంత్రాలు వచ్చాయి. స్థానికంగా ఉన్న మధ్యవర్తి కడవకొల్లు పెద్ద ముత్యాలు ద్వారా రైతు యాదగాని సత్యనారాయణ పొలంలో శుక్రవారం వరి కోత పని చేయాలని నిర్ణయించారు. దీంతో ఉదయం వరి కోత యంత్రాన్ని లారీలో తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు అడ్డువచ్చాయి. దీంతో లారీపై ఉన్న వారు కర్రలతో తీగలను ఎత్తేందుకు యత్నించి విఫలమయ్యారు. తీగలు యంత్రానికి తగలడంతో లారీలోకీ విద్యుత్ ప్రసరించింది. దీంతో లారీ నడుపుతున్న కడిమి భాస్కర్
( 32), క్యాబిన్‌లో ఉన్న మరో వ్యక్తి దామవరపు నరసింహారావు అలియాస్ జగపతి (22) అక్కడిక్కడే మృతిచెందారు. వీరిని రక్షించబోయి తాటిపర్తి పవన్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిలో భాస్కర్‌ది పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మోతుకూరు మండలం రెడ్డిపాలెం కాగా, జగపతి, పవన్‌లది మోతుకూరు మండలం కొత్త ఒంగులూరు. దీంతో పవన్‌ని, మృతదేహాలను స్థానికులు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేబ్రోలు ఎస్సై చావా సురేష్, విద్యుత్ ఏఈలు రాళ్లపల్లి భీమేశ్వరరావు(నారాయణపురం), రెడ్డి సుబ్రహ్మణ్యం(గొల్లగూడెం) ఉంగుటూరు ఏవో డాక్టర్ ఎస్.ప్రసాద్, గ్రామ సర్పంచి నరమామిడి నాగేశ్వరరావు, బాదంపూడి సొసైటీ అధ్యక్షులు మల్లారెడ్డి శేషగిరి పరిశీలించారు.
పొట్టకూటి కోసం వచ్చి..
పొట్టకూటికోసం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వారిద్దరూ విద్యుదాఘాతానికి బలైపోయారు. నెల్లూరు జిల్లా నుంచి రెండు యంత్రాలు రాగా, వాటితోపాటు మొత్తం 20 మంది సిబ్బంది వచ్చారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తోటి సిబ్బందిని విషాదఛాయలు ఆవరించాయి. పొట్టకూటి కోసం వచ్చామని, ఏటా వస్తున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇంద్రకీలాద్రికి వెళ్తూ.. అనంతలోకాలకు..
భీమడోలు : విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్తున్న ఇద్దరు భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శుక్రవారం గుండుగొలను–పాతూరు మధ్య షుగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపవరం మండలం జల్లికొమ్మెరకు చెందిన అడ్డగర్ల గిరి(20), మద్దాల సూరిబాబు(21), మద్దాల ఏడుకొండలు, మద్దాల సాయి వ్యవసాయ కూలీలు. వీరంతా బంధువులు. నలుగురూ కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కాలినడకన బయలుదేరారు. వారు గుండుగొలను దాటి పాతూరు పంచాయతీ పరిధిలోకి వచ్చే సరికి తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ముందుగా రోడ్డు పక్కనే జంటగా నడుస్తున్న అడ్డగర్ల గిరి, మద్దాల సూరిబాబుపై నుంచి దూసుకువెళ్లింది. దీంతో అక్కడికక్కడే గిరి దుర్మరణం పాలయ్యాడు. కొద్దిసేపు కొనప్రాణాలతో కొట్టుకున్న సూరిబాబు సహచరుల కళ్లెదుటే తుదిశ్వాస విడిచాడు. దీంతో ఏడుకొండలు, సాయి తీవ్రంగా రోదించారు. మృతులిద్దరికీ వివాహాలు కాలేదు. దీంతో ఇద్దరి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును అందులో ఉన్నవారు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కారు అద్దాలు దెబ్బతిన్నాయి. మృతదేహాలను పంచనామా నిమిత్తం పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement