'టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి' | sai kiran vissamraju visits koyyalagudem | Sakshi
Sakshi News home page

'టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి'

Published Tue, Jun 14 2016 8:59 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి' - Sakshi

'టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి'

సినీహీరో సాయి కిరణ్


కొయ్యలగూడెం : సినిమాల్లో హీరోగా రాణించడానికి టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా తోడు ఉండాలని, ముఖ్యంగా తెలుగు చలన చిత్రసీమలో ఇది చాలా అవసరం అని సినీ హీరో విస్సంరాజు సాయికిరణ్ అన్నారు. సోమవారం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో డాక్టర్ దిలీప్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు సినీ హాస్య నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణతో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ డాక్టర్ దిలీప్‌కుమార్ తాను క్లాస్‌మేట్స్ అని, తమ మిత్రత్వం కారణంగా చెన్నై నుంచి నేరుగా కొయ్యలగూడానికి గోపాలకృష్ణతో కలిసి వచ్చానని చెప్పారు. తమిళంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రగా నిర్మితమవుతున్న చిత్రంలో తాను ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.

నందికొండ, మారాజు, తొలికిరణం తదితర తెలుగుచిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. తన తండ్రి ప్రఖ్యాత గాయకుడు రామకృష్ణకు స్వర్గీయ నందమూరి తారకరామారావు అందించిన చేయూత వల్ల విఖ్యాత గాయకునిగా ఎదిగారని సాయికిరణ్ పేర్కొన్నారు.
 
ప్రముఖ హీరో రవితేజను ఆదర్శంగా తీసుకుని తనవంతు కృషిచేస్తున్నానని నేటి యువతకు తగ్గట్టు శరీర సౌష్టవాన్ని మార్చుకుని హీరోగా స్థిరపడాలని శ్రమిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల ఒక సినిమా నిర్మాణంలో తనకు ప్రమాదం సంభవించడంతో మెడకు తీవ్ర గాయమైందని, దాని వల్ల కొంత విరామం వచ్చినట్టు చెప్పారు.

యోగా, మెడిటేషన్ వల్ల పూర్తిగా కోలుకోగలిగినట్టు చెప్పారు. తాను నటించిన చిత్రాల్లో సత్తా, ప్రేమించు చిత్రాలు తనకు బాగా ఇష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతానికి టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక టెలీఫిలింలు ఎక్కువగా చేస్తున్నట్టు చెప్పారు. కళలకు పుట్టినిల్లు గోదావరి జిల్లాలు అని అన్నారు. హాస్యనటులు ఆకెళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు 52 తెలుగు చలన చిత్రాల్లో నటించినట్టు చెప్పారు. సోగ్గాడే చిన్నినాయనా, రాజా చెయ్యివేస్తే చిత్రాల్లో మంచి పేరు  వచ్చిందన్నారు. అనంతరం నటులిద్దరినీ డాక్టర్ దిలీప్‌కుమార్ దంపతులు ఘనంగా సత్కరించి మెమొంటోలు అందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement