సాయిశ్రీకి కన్నీటి వీడ్కోలు
గాంధీనగర్ (విజయవాడ) : తండ్రి కర్కశత్వానికి, కబ్జాకోరుల దాష్టీకానికి బలైన చిన్నారి మాదంశెట్టి సాయిశ్రీ(13) అంతిమయాత్ర సోమవారం అశ్రునయనాల మధ్య సాగింది. ‘డాడీ... నన్ను బతికించు..’ అంటూ తండ్రిని వేడుకున్న సాయిశ్రీ సెల్ఫీ వీడియో మీడియాలో ప్రసారం కావడంతో అందరినీ కలచివేసింది. ఆ చిన్నారని కడసారి చూసేందుకు మహిళలు తరలివచ్చారు. సాయిశ్రీ భౌతికకాయం వద్ద ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. దుర్గాపురంలోని సాయిశ్రీ ఇంటి నుంచి సాంబమూర్తిరోడ్డు వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ నుంచి వాహనంలో ఆమె భౌతికకాయాన్ని కృష్ణలంకలోని స్వర్గపురికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటి సమీపంలో సాయిశ్రీ భౌతికకాయం ఉంచి కొద్దిసేపు నిరసన తెలిపారు.
సుమశ్రీకి బాసట...
సాయిశ్రీ తల్లి సుమశ్రీని పలువురు నాయకులు పరామర్శించారు. ఆమెను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. సాయిశ్రీకి నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఫణిరాజు, ఐద్వా నాయకులు కె.శ్రీదేవి, డివైఎఫ్‌ఐ నాయకుడు మాధవ్ తదితరులు ఉన్నారు.
బొండా ఉమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
చిన్నారి సాయిశ్రీ మృతికి పరోక్షంగా కారకుడైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయిశ్రీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దుర్గాపురంలోని ఆమె ఇంటికి వెళ్లిన రాజకీయ, ప్రజా సంఘాలు, మహిళ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాయిశ్రీ తండ్రి శివకుమార్, ఆయనకు సహకరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిని కబ్జా చేసి చిన్నారి మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగరంలో కబ్జాలు పెరిగిపోతున్నా, ఇక్కడే నివాసం ఉంటున్న సీఎం పట్టించుకోవడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
20 రోజులుగా ఎమ్మెల్యే బొండా ఎందుకు స్పందించలేదు
ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులు నా ఇల్లు కబ్జా చేశారు. అందువల్లే ఇల్లు అమ్మలేకపోయాను. పాపకు వైద్యం చేయించలేకపోయాను. 20 రోజులుగా నా గోడు వెళ్లబోసుకున్నా ఎమ్మెల్యే ఉమా స్పందించలేదు. న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా? పాప చనిపోయాక ఎందుకు స్పందించారు. మాదంశెట్టి శివకుమార్ బెంగళూరులో ఉన్నారని ఎమ్మెల్యే ఎలా చెబుతారు? శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మాట్లాడడం సరికాదు. శవరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు ఉంటే నన్ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. నాకు జరిగిన అన్యాయంపై సీపీని కలుస్తా. బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి.
– సుమశ్రీ, సాయిశ్రీ తల్లి