సాక్షిఫన్‌డే ఆవిష్కరిస్తున్న టీటీడీ చైర్మన్ చదలవాడ కష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, రమణ
– బ్రహ్మోత్సవాల ఆరో ప్రత్యేక సంచికకు టీటీడీ ప్రసంశలు
– సాక్షి యాజమాన్యం, ఫన్ డే బందానికి ప్రత్యేక అభినందనలు
సాక్షి,తిరుమల:
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేక కథనాలతో ‘‘ విశ్వపతికి బ్రహ్మాండసేవ’’ శీర్షికన ప్రచురితమైన సాక్షి ‘ఫన్ డే’ సంచికను ఆదివారం రాత్రి విష్వక్సేనుడి ఊరేగింపులో ఆవిష్కరించారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో శ్రీనివాసరావు , డెప్యూటీ ఈవో కోదండరామారావు, పేష్కార్ సెల్వం, బోర్డు సభ్యులు జి.భానుప్రకాష్‌రెడ్డి, ఏవీ రమణ, ఆలయ అర్చకులు ‘ సాక్షి ఫన్ డే’ సంచికను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో వరుసగా ఆరో ప్రత్యేక సంచిక తీసుకొచ్చిన ఘనత సాక్షి యాజమాన్యానికే దక్కిందని కొనియాడారు. తిరుమలేశుని వైభవ విశేషాలు, ఆలయంలోని కైంకర్యాలు, చారిత్రక నేపథ్యం, వేయేళ్ల రామానుజుడు, మహంతుల కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులు, ఆభరణాల ఆనంద నిలయుడు, తరతరాల సంప్రదాయం, కనువిందు చేసే అరుదైన ఫొటోలు.. వంటి ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలతో వెలువడిన ఫన్ డే సంచిక విశ్లేషణాత్మకంగా ఉండేలా కథనాలు రాసిన సాక్షి సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ సహదేవ కేతారితోపాటు ఫన్‌డే బందాన్ని ప్రశంసించారు. సెప్టెంబరు 25, 2011న ‘‘నమో..వేంకటేశా!’’, సెప్టెంబరు 16, 2012 ‘బ్రహ్మాండ నాయకుడు’ , అక్టోబరు 6, 2013న ‘‘ శరణం నీ దివ్యచరణం’’, సెప్టెంబరు 28,2014న ‘‘నమో లక్ష్మీపతే’’, సెప్టెంబరు 20,2016 ‘‘బంగారు స్వామికి బ్రహ్మాండోత్సవం’’ తోపాటు తాజా ఆదివారం సంచిక విశ్వపతికి బ్రహ్మాండ సేవ పేరుతో ప్రత్యేక సంచిక ప్రచురించారని అభినందించారు. తిరుమలకు సంబంధించిన తెలియని ఎన్నో చారిత్రక అంశాలు, విశేషాలు, ఉత్సవాల వైభవాన్ని శ్రీవారి భక్తులకు, పాఠకులకు ‘సాక్షి ఫన్ డే’ ద్వారా తెలియజేయటంలో సాక్షి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని టీటీడీ చైర్మన్ చదలవాడ కష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు కొనియాడారు.