ఊపిరి తీస్తున్న ‘దోపిడీ’
-
కృష్ణానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు
-
డ్రెడ్జర్లతో 30 అడుగుల లోతు వరకు గుంతలు
-
రోజుకు వందల లారీల ఇసుక తరలింపు
-
గతంలోను మునగోడు వ్యక్తి మృతి
-
అధికారపార్టీ ఎమ్మెల్యే అండదండలతో దందా
-
గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ నేతలు
తాడేపల్లి రూరల్, పెదకూరపాడు,అమరావతి: బోట్స్‌మెన్ సొసైటీలకు ఇచ్చినా.. డ్వాక్రా మహిళ గ్రూపులకు అప్పగించినా.. చివరికి ఉచితంగా ఇస్తున్నా.. ఇసుకతవ్వకాలలో అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. అక్రమార్కుల ధనదాహానికి అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. చేతికి అంది వచ్చిన యువకులు కృష్ణమ్మ గర్భంలో కలిసిపోయి, కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. అధికారపార్టీ నాయకుల ధనదాహం ఎందరో యువకుల ప్రాణాలను గాలిలో కలుపుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఇసుక అక్రమతవ్వకాల వల్ల ఏర్పడిన గుంతలోపడి గతంలో మునగోడులో ఒకరు, నేడు దిడుగులో ఐదుగురు.. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క అమరావతి మండలంలోనే అధికార పార్టీ నాయకుల ధనదాహానికి ఆరుగురు బలయ్యారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
కృష్ణానది తీరంలో ఇసుక ఆక్రమాలు ఇలా......
కృష్ణా నదీతీరాన మునగోడు, దిడుగు, మల్లాది, వైకుంఠపురం ఇసుకరీచ్‌ల్లో గతంలో పడవ కార్మికులు నదిలో పడవకు బకెట్లను ఏర్పాటు చేసి ఇసుకను తోడి తెచ్చేవారు. ఆ ఇసుకను రీచ్‌లో ఉండే వాహనాలకు లోడింగ్ చేసేవారు. కానీ గత రెండేళ్లగా అత్యంత అధునిక పద్ధతులలో ఇసుక తోడే యంత్రాలు(డ్రెడ్జర్లు)తో అధికారపార్టీ నేతలు రంగప్రవేశం చేశారు. సుమారు 30 నుంచి 40 అడుగుల లోతు వరకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకతవ్వకాలు జరుపుతున్నారు. గతంలో అక్రమ తవ్వకాలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో స్థానిక అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ తవ్వకాలు యధేచ్ఛగా సాగిపోయాయి.
దిడుగు రీచ్‌పై గతంలోనే హైకోర్టు స్టే..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దిగుడు రీచ్‌లో ఇసుక తవ్వకాలను బోట్స్‌మెన్ సొసైటీకి అప్పగించారు. సొసైటీ పేరుతో టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలించారు. రీచ్‌కు కృష్ణానదికి కృష్ణా జిల్లావైపు, గుంటూరు జిల్లా వైపు రెండు వైపులా డ్రెడ్జర్ల ద్వారా తవ్వకాలు జరిపి రోజుకు వందలకొద్దీ లారీల్లో ఇసుక రవాణా చేశారు. దీంతో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ అధికారులు కూడా స్పందించకపోవడంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్డు తవ్వకాలపై స్టే ఇచ్చారు. అనంతరం ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టిన తరువాత కూడ పొక్లెయిన్లు, డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు జరుపడం వల్లన పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇవి ఇప్పుడు ప్రాణాంతకమవుతున్నాయి.
గతంలో మునుగోడు రీచ్‌లో ఒకరు.. ఇప్పుడు దిడుగులో ఐదుగురు...
డ్రెడ్జర్లు, పొక్లెయిన్లతో పరిమితికి మించి సాగుతున్న ఇసుకు అక్రమ తవ్వకాల వలన నదిలో పెద్ద పెద్ద లోయలు ఏర్పడ్డాయి. అమరావతి మునుగోడు రీచ్‌లో ఇలా ఏర్పడిన గోతుల్లో పడి గతేడాది గనపా వెంకటరెడ్డి(30) మృతి చెందారు. ఈ సంఘటన మరువక ముందే మంగళవారం మరో ఘోరం జరిగింది. ఈ నెల 12 నుంచి మొదలైన కృష్ణపుష్కరాలకు ఎగువనున్న పులిచింత ప్రాజెక్టు నుండి ప్రతిరోజు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సుమారు 10వేల 500 క్యూసెకుల నీటిని విడుదల చేయడంతో అంతకు ముందు అక్రమంగా డ్రెడ్జర్లు, పొక్లెయిన్లతో ఇసుకను తీయటం వల్ల ఏర్పడిన భారీ గుంతలు నీటితో నిండిపోయాయి. మంగళవారం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలానికి చెందిన 11మంది విద్యార్థులు అమరావతి మండలం దిడుగు పంచాయతీ పరిధిలోని కృష్ణానది ఆవల ఒడ్డున స్నానం ఆచరించేందుకు వచ్చారు. పుష్కర స్నానంతోపాటు సరదాగా ఈత కొడదామనుకున్నవారికి గతంలో అక్రమంగా అధికార పార్టీ నాయకులు ఇసుక తవ్విన గుంతలు యమపాశాలయ్యాయి. గుంతల లోతు తెలియక ఒక్కసారిగా అధిక లోతుగల నీటి లోయల్లో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధుల అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేసి నదీ తీరాన ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆ ఒక్క లొసుగు ఆధారంగా..
కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న పర్యావరణ శాఖ అనుమతులు తీసుకుని తరువాతే ఏ ప్రాంతంలోనైనా ఇసుక తవ్వకాలు నిర్వహించాల్సి ఉంది. ఆ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలకు తెరలేపింది. 50 వేల క్యూబిక్ మీటర్లలోపు ఇసుక నిలువలున్న చోట రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వొచ్చు అనే ఒక్క సాకుతో ఒకే ఇసుకరీచ్‌ని మూడు నుంచి 5 భాగాలుగా విడదీసి టీడీపీకి చెందిన వేర్వేరు వ్యక్తులకు నిర్వహణ బాధ్యతను అప్పగించారు. దీంతో తమ్ముళ్ళు నిబంధనలకు నీళ్లొదిలి ఒక మీటరు (మూడు అడుగులు) ఇసుక తీయాల్సిన చోట 8 నుంచిl10 మీటర్ల లోతు వరకూ ఇసుక తవ్వకాలు నిర్వహించారు. వారికి కేటాయించిన ప్రాంతంలో ఇసుక నిల్వలు అయిపోయిన తరువాత కూడా మిగిలిన ఇసుకను కూడా డోజర్లను తీసుకువచ్చి మరీ నల్లమట్టి వచ్చే వరకూ తోడుకున్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా వారికి ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు నిర్వహించి భారీగా గోతులు పెట్టారు. ఇసుక అయిపోయినా డోజర్లతో దగ్గరకు చేర్చి మరీ తోడుకున్నారు.