రూ.కోట్లు విలువచేసే ఇసుక క్వారీ కోసం ‘ముఖ్య’ నేత రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు క్వారీలోకి అడుగుపెట్టేందుకు సాహసించని కాంట్రాక్టర్ ... యంత్రాలు, వాహనాలతో నదిలోకి ప్రవేశించారు. భారీగా వెళ్తున్న వాహనాలను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. క్వారీలోకి అడుగుపెట్టటానికి వీల్లేదని ఎదురుతిరిగారు.వాహనాలకు అడ్డుగా పశువులను నిలిపారు. సమాచారం అందుకున్న తుళ్లూరు ఎస్‌ఐ, సీఐ సుధాకర్, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ క్వారీ వద్దకు చేరుకున్నారు. పోలీసులు, స్థానికుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. చివరకు భారీ వర్షం ప్రారంభంకావడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం, రాయపూడి ప్రాంతం కృష్ణా నదిలో కొద్దిరోజుల కిందట డ్రెడ్జర్లతో భారీ ఎత్తున ఇసుకను డంప్ చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.30 కోట్లు విలువ చేసే ఆ ఇసుకను అధికారపార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలతో కంగుతిన్న మాఫియాముఠా తవ్వకాలతో పాటు రవాణాను నిలిపివేసింది. కొన్ని రోజుల తరువాత స్థానికులు ఆ ఇసుకను అవసరాల కోసం తరలించటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాఫియా ముఠా సభ్యులు క్వారీ వద్దకొచ్చి స్థానికులను బెదిరించే ప్రయత్నాలు చేశారు. ఎంతకీ వినకపోవటంతో పోలీసులు, ఇరిగేషన్, మైనింగ్ అధికారులను రంగంలోకి దింపారు. వారి మాటలనూ లెక్కచేయకపోవటంతో అధికార పార్టీకి చెందిన ‘ముఖ్య’ నేతను ఆశ్రయించారు.
‘ముఖ్య’ నేత ఆదేశాలతో ఇసుక తరలింపు...
ఇసుక తరలింపునకు ‘ముఖ్య’ నేత పచ్చజెండా ఊపటంతో మాఫియా ముఠా రెండు రోజులుగా నదిలోని క్వారీ వద్దకు భారీ ఎత్తున వాహనాలను పంపారు. డంప్‌చేసిన ఇసుకను యంత్రాలతో లారీలకు నింపే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే స్థానికులు అడ్డుకోవటంతో శనివారం ఇసుక తరలింపును నిలిపివేశారు. తిరిగి ఆదివారం క్వారీ వద్దకు భారీ ఎత్తున వాహనాలు రావటం గమనించిన స్థానిక మహిళలు నదిలోకి వెళ్లకుండా కరకట్టపైనే వాహనాలను అడ్డుకున్నారు. వాహన డ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో మొదట ఎస్‌ఐ, ఆ తరువాత సీఐ, అనంతరం ఏఎస్పీ కరకట్ట వద్దకు చేరుకున్నారు.
వాహనాలు నది లోకి వెళ్లటానికి వీల్లేదని స్థానికులు అడ్డుకున్నారు. అరెస్టు చేయదలిస్తే చేసుకోండంటూ బైఠాయించారు. ఇసుక తరలింపును ఆపటం తమ చేతుల్లో లేదని, పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని ఏఎస్పీ తేల్చిచెప్పారు. అత్యున్నత న్యాయస్థానం, గ్రీన్‌ట్రిబ్యునల్ ఆదేశాలను గుర్తు చేశారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదనే నిబంధన గురించి తెలియదా? అని స్థానికులు ఏఎస్పీని ప్రశ్నించారు. అదంతా తనకు తెలియదని, పై నుంచి వచ్చిన ఆదేశాలను పాటించక తప్పదని మరో సారి తేల్చిచెప్పారు. కొంత సమయం పాటు పోలీసులు, స్థానికుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. ఇసుక తరలింపు గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే సీఎం లేదా మంత్రులను కలవాలని ఏఎస్పీ స్థానికులకు వివరించారు. ఇంతలో భారీ వర్షం రావటంతో పోలీసులు, స్థానికులు, వాహనాలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
నివాస నిర్మాణాల పేరుతో ఇసుక డంప్‌లు ...
స్థానికంగా నివాసాలు నిర్మించుకునేందుకంటూ కొందరు అధికారపార్టీ నేతలు గ్రామాల్లో ఇసుకను డంప్ చేస్తున్నారు. రాయపూడి, బోరుపాలెం తది తర గ్రామాల్లో ఈ తరహా ఇసుక నిల్వ లు కనిపించాయి. పగలంతా కృష్ణా నది లో ఇసుకను డంప్ చేయటం.. రాత్రి పూట వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై స్థానికులు పత్రికలు, మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో భాగంగా రాయపూడిలో ఓ టీడీపీ నేత నివాసం వద్ద భారీఎత్తున ఇసుక డంప్ కనిపిం చింది. ఈ విషయం గురించి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.
క్వారీలో తిరుగుబాటు
Published Mon, Mar 20 2017 10:51 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement