గాలంతో వెదగ్గా దొరికిన మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది; చిన్నారులను వెదుకుతున్న గజ ఈతగాళ్లు
తాడేపల్లిరూరల్: కృష్ణానదిలో టీడీపీ నేతలు ఇసుక తవ్వకాల పేరుతో అఘాతాలను ఏర్పాటు చేశారని గుండిమెడ ఇసుక రీచ్‌లో విద్యార్థులు మృతి చెందిన సంఘటనతో ఆ అవినీతి గుంతలు బయటపడ్డాయి. విద్యార్థులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వివిధ శాఖల అధికారులతో పాటు ఎంపీ గల్లా జయదేవ్ సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ ఆ గుంతల్లో వెదుకుతున్న వారు సాక్షాత్తు అక్కడకు వచ్చిన ఎంపీతో ఇవి గుంతలు కాదు, మీ పార్టీ నేతల అవినీతి అఘాతాలని వెల్లడించారు. మీడియా ప్రతినిధులు సైతం ప్రశ్నించడంతో ముందు మృతదేహాలను బయటకు తీసిన తర్వాత ఇసుక తవ్వకాలపై విచారణ జరుపుదామంటూ ఎంపీ స్పష్టం చేశారు.
చిన్నారులు మృతి చెంది మూడు రోజులు గడుస్తుంది. నేటికీ దానిపై విచారణ చేపట్టిన దాఖలాలు ఏమీ కనిపి ంచ లేదు. విద్యార్థులు చనిపోయారని తెలియడంతో ఊళ్లకు ఊళ్లూ కదిలి సంఘటనా స్థలానికి వచ్చాయి. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సైతం అక్కడకు వచ్చాయి. స్థానికులు 40 మంది మొదట గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ విద్యార్థుల ఆచూకీ లభ్యంకాలేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మరో 40 మంది వచ్చి గాలించినా ఫలితం లేకపోవడంతో పెద్ద పెద్ద బోట్లు తీసుకువచ్చి నీటి అడుగు భాగాన పెద్ద పెద్ద బాదులతో నీటిని చిలికారు. అప్పుడు కానీ రెండు మృతదేహాలు బయట పడలేదు. అలా గ్రామస్తులు వచ్చిన సహాయక బృందాలు పెద్దపెద్ద కర్రలను నీటిలోపలకు పోనిచ్చి బాదులు నెడుతుంటే అక్కడ ఎంత లోతు ఉంది, టీడీపీ నేతలు ఎంత అవినీతికి పాల్పడ్డారో స్పష్టమైంది. అధికారులుసైతం ముక్కుమీద వేలేసుకున్నారు.
తప్పు చేశామన్న బాధ..
ఇరిగేషన్ శాఖ విజయవాడ డీఈ చౌదరి సంఘటనా స్థలానికి వచ్చి దూరంగా నిలబడి తప్పు చేశామన్న బాధతో కుమిలిపోయారన్న విషయాన్ని అందరూ గమనించారు. ఇంత జరిగినా ఇప్పటివరకు ప్రభుత్వం దానిమీద విచారణ చేపట్టలేదు. వాస్తవానికి కృష్ణానది తీరంలో గుండిమెడ ఇసుక రీచ్‌లో ఇసుక తవ్వకాలకు 3 మీటర్లు అనుమతిచ్చినట్లు సమాచారం. కానీ అధికార పార్టీ నేతలు 12 మీటర్లు ఇసుక తవ్వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నారులు ప్రాణాలు తీసిన అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేయకుండా, టీడీపీ నేతలు చనిపోయిన విద్యార్థుల కుటుంబాల చుట్టూ తిరుగుతూ ఏదో తూతూమంత్రంగా వారికి ఆర్థిక సహాయం చేస్తూ సమస్యను పక్కదారిపట్టిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
అలాంటి గోతులు ఎప్పుడూ చూడలేదు
చిన్నారులు చనిపోయిన వద్ద గుంతలను మా జీవితంలో కృష్ణానదిలో ఎప్పుడూ చూడలేదు. దారుణంగా తవ్వేసి ఆ గుంతలను అలాగే వదిలేశారు. 20 అడుగుల బాదును లోపలకు పంపిస్తే అడుగుభాగం తగల్లేదు. అడుగుభాగంలో ఉన్న మృతదేహాలు పైకి ఏం వస్తాయి? 30 అడుగుల లోపలకు వెళ్లి వెదకడమనేది ఎవరి వల్లా కాని పని. –పోకల వేమయ్య
Comments
Please login to add a commentAdd a comment