శనివారం నగరానికి సంకీర్త్ మృతదేహం | sankirth body will come saturday to city | Sakshi
Sakshi News home page

శనివారం నగరానికి సంకీర్త్ మృతదేహం

Published Thu, Jul 21 2016 11:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

సంకీర్త్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ - Sakshi

సంకీర్త్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ

సాక్షి,సిటీబ్యూరో: అమెరికాలోని అస్టిన్‌ నగరంలో సోమవారం తెల్లవారుజామున హత్యకు గురైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుండం సంకీర్త్‌(24) మృతదేహం శనివారం రాత్రి నగరానికి చేరుకోనుంది. అస్టిన్‌లో శవపరీక్ష, ఇతర న్యాయపరమైన అంశాలను సంకీర్త్‌ సన్నిహితులు సందీప్, సంజయ్‌ పూర్తి చేశారు. భౌతికకాయాన్ని తొలుత న్యూజెర్సీలోని భారత రాయభార కార్యాలయానికి తరలించి అక్కడి నుండి హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇదిలా ఉండగా గొడవ జరిగిన రోజు సంకీర్త్‌ గదిలోనే ఉన్న ప్రణీత్‌ పాత్రపై కూడా విచారణ చేపట్టాలని సందీప్, సంజయ్‌ అక్కడి పోలీస్‌లకు విజ్ఞప్తి చేశారు.

ఇంజినీరింగ్‌లో సంకీర్త్‌ క్లాస్‌మేట్‌ అయిన ప్రణీత్‌ డల్లాస్‌లో ఉంటూ, తరచూ అస్టిన్‌లో సంకీర్త్‌ గదికి వచ్చి వెళుతుండే వాడు. నల్లకుంటకు చెందిన ప్రణీత్‌ తండ్రి బీడీఎల్‌ ఉద్యోగం చేస్తూ కుమారుని ఖర్చుల కోసం ఇక్కడి నుండే డబ్బు పంపిస్తున్నారు.. కాగా ఉద్యోగాన్వేషణలో ఉన్న సాయి సందీప్‌గౌడ్‌ కూడా ప్రణీత్‌ ద్వారానే సంకీర్త్‌ రూంలోకి వచ్చాడా? లేక వేరెవరైనా సిఫార్సు చేశారా.. అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సంకీర్త్,సందీప్‌ మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా ఏర్పడిన వివాదమే ఘర్షణకు దారి తీసి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే అస్టిన్‌ పోలీసుల అదుపులో ఉన్న సందీప్‌గౌడ్‌ సమీప బంధువులు బుధవారం న్యాయవాది ద్వారా పోలీస్‌లను కలిసి, అతని కారు, ఇతర వస్తువులను తీసుకుకెళ్లారు. నగరానికే చెందిన సందీప్‌గౌడ్‌ చేవెళ్ల సమీపంలోని కాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసినట్లు సమాచారం.

మంత్రుల పరామర్శ..
కుత్బీగూడలో నివాసం ఉంటున్న సంకీర్త్‌ కుటుంబ సభ్యులను గురువారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ హన్మంతరావు తదితరులు పరామర్శించారు. సంకీర్త్‌ భౌతికఖాయాన్ని త్వరగా తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ఏర్పాట్లు చేశారని దత్తాత్రేయ తెలిపారు. ఇదిలా ఉంటే సంక్తీర్త్‌ మరణవార్తను ఆమె తల్లికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. శనివారం రాత్రిలోగా మృతదేహం నగరానికి చేరితే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement