గుప్పుమంటున్న నాటు సారా | sara transport in east godavari | Sakshi
Sakshi News home page

గుప్పుమంటున్న నాటు సారా

Published Tue, Jan 17 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

sara transport in east godavari

  • తోటల్లో జోరుగా తయారీ 
  • వివిధ ప్రాంతాలకు ఎగుమతి 
  • పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు
  • తొండంగి (తుని) : 
    మండల పరిధిలోని వివిధ గ్రామాల సమీపంలోని జీడిమామిడి తోటల్లో నాటు సారా విచ్చలవిడిగా తయారు చేస్తూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా పీఈ చిన్నాయపాలెం, బెండపూడి, రావికంపాడు, కొమ్మనాపల్లి, సీతారాంపురం, పైడికొండ, ఆనూరు, ఎ.కొత్తపల్లి, గోపాపట్నం తదితర గ్రామాల పరిసరాల్లో కొండ ప్రాంతాలు, మామిడి, జీడితోటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తోట మాటున భారీ ఎత్తున బెల్లపు ఊటలను పులియబెట్టి నాటు సారా కాస్తున్నారు. అక్కడి నుంచి ప్లాస్టిక్‌ క్యాన్ల ద్వారా మండలంలోని గ్రామాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రాత్రి వేళల్లో రహస్యంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం రూ.10, రూ.20లకే మంచి కిక్కిచ్చే నాటు సారా లభిస్తుండడంతో వ్యవసాయ కూలీలు మద్యానికి బానిసలై ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. నాటు సారా వల్ల తమ కుటుంబాలు, జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయని బాధిత మహిళలు వాపోతున్నారు. 
    నాటు సారాతో ఆరోగ్యానికి ముప్పు
    నల్ల బెల్లం, అమ్మోనియా, నికిల్, లెడ్‌ మిశ్రమం, బ్యాటరీ పౌడర్‌ను నీటిలో కలిపి పులియబెడతారు. సుమారు మూడు రోజుల పాటు పులియబెట్టిన ఆ ఊటను పొయ్యిపై పెట్టి మరగబెట్టడం ద్వారా వచ్చే ఆవిరిని పడతారు. ఆ ఆవిరి ద్రావణంగా మారి నాటు సారా తయారవుతుంది. తక్కువ ధరకే ఇది లభిస్తుండడంతో వ్యవసాయ కూలీలు, పేదలు దీన్ని తాగుతున్నారు. ఉత్సవాలు, జాతరలు, ఇతర కార్యక్రమాల్లో నాటు సారా ఏరులై ప్రవహిస్తోంది. బ్రాందీ షాపుల్లో లభించే మద్యం కన్నా ఇది బాగా తక్కువ ధరకు లభించడంతో పాటు ఎక్కువ మత్తు ఇస్తుండడంతో మద్యానికి బానిసలైన పేదలు నాటుసారా తాగేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
     దీని తయారీలో కలిపే ప్రాణాంతక పదార్థాల వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, మొదడులోని నాడీ వ్యవస్థ ఇతర అవయవాలపై ప్రభావం చూపడంతో కొంతకాలానికి అనారోగ్యానికి గురై మరణిస్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా నాటు సారా తయారు చేస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. నెలవారీ మామూళ్ల వల్లే వారు ఇటువైపు తొంగి చూడ్డం లేదన్న ఆరోపణలు వినిపిన్నాయి. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి నాటు సారా తయారీని నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.
     
    ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు
    తమ గ్రామం నాటు సారా వాసనతో గుప్పుమంటోందని పీఈ చిన్నాయపాలెం గ్రామానికి చెందిన పి.విజయమ్మ తెలిపారు. రాత్రి వేళల్లో తోటల్లో నాటు సారా తయారు చేస్తున్నారని, దీన్ని తక్షణం నిరోధించాలని తుని ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement