నాటుసారా తయారీకి వినియోగిస్తున్నారంటూ అమ్మకాల నిషేధం
కిలో, రెండు కిలోలు కూడా అమ్మకుండా కట్టడి
పిండి వంటలు చేయలేక పోతున్నామని ప్రజల నిరాశ
పరకాల : నాటుసారా తయారీకి వినియోగిస్తున్నారంటూ తెల్లబెల్లం అమ్మకాలను నిషేధించడంతో సంక్రాంతి పండుగకు అరిసెలు చేసుకునే ఆనవాయితీకి బ్రేక్ పడుతోంది. ఏటా సంక్రాంతి సందర్భంగా అరిసెలు, సకినాలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఈసారి బెల్లం అమ్మకాలను కట్టడి చేయడంతో ఎక్కువ మంది ఇండ్ల నుంచి అరిసెల పాకం వాసన రావడం లేదు! దీంతో అరిసెలు లేకుండానే సంక్రాంతి చేసుకోవాలా అ ని ప్రజలు మధనపడుతుండగా.. కిలో, రెండు కిలోలు కూడా అమ్మనివ్వకపోవడంపై వ్యాపారులు మండిపడుతున్నారు.
నల్లబెల్లం స్థానంలో తెల్లబెల్లం
పలు గ్రామాల్లో గుడుంబా తయారీకి నల్లబెల్లం ఉపయోగించేవారు. ఈ విషయాన్ని గుర్తించి ఎక్సైజ్ అధికారులు నల్లబెల్లాన్ని నిషేధించడంతో కొంతకాలం గుడుంబా తయారీ నిలిచిపోయింది. అయితే, కొద్దిరోజులకు గుడుంబా తయారీదారులు తెల్లబెల్లం ఉపయోగించడాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నాటుసారాను నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమయం నుంచి తెల్లబెల్లం అమ్మకాలను కూడా కట్టడి చేస్తోంది. ఈ నిర్ణయంతో గుడుంబా తయారీ ఏ మేరకు నిలిచిపోయిందో తెలియదు కానీ.. శుభకార్యాలు, వేడుకలతో పాటు పండుగల సమయంలో తీపి వంటకాలు చేసుకుందామనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది.
ఇక కిలో, రెండు కిలోల బెల్లం నిల్వ ఉన్నా కేసులు పెడుతున్నారంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కిరాణం వ్యాపారి తన మనువడు పుట్టినరోజు సందర్భంగా వంటల్లో ఉపయోగించేందుకు ఐదు కిలోల బెల్లం తీసుకొస్తుంటే ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు తరచు చోటు చేసుకుంటుండడంతో బెల్లం అమ్మాలన్నా.. కొన్నాలన్నా బెంబేలెత్తిపోయే పరిస్థితి పరకాలలో నెలకొంది.
బెల్లం లేని అరిసెలు!
Published Fri, Jan 13 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
Advertisement
Advertisement