విశాఖ నగర సర్దార్... బ్లాక్ షో ! | sardar gabbar singh black shows in visakhapatnam district | Sakshi
Sakshi News home page

విశాఖ నగర సర్దార్... బ్లాక్ షో !

Published Fri, Apr 8 2016 11:11 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

విశాఖ నగర సర్దార్... బ్లాక్ షో ! - Sakshi

విశాఖ నగర సర్దార్... బ్లాక్ షో !

  • కీలక నేత కుటుంబానికి కలెక్షన్ల పండుగ
  • థియేటర్లు యజమానులవి.. టికెట్లు వీరివి
  • అడ్డంగా రేట్లు పెంచేసి అమ్మకాలు
  • తొలి మూడు రోజుల్లో రూ. 50 కోట్ల దోపిడీకి స్కెచ్
  • అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే...ఫ్యాన్స్కు పండగే పండుగ. తొలి షోనే చూడాలి. కుదరకపోతే కనీసం తొలిరోజే ఏదో ఓ షో చూడాల్సిందే. .. ఈల వేసి... గోల చేసి.. కేవ్వు కేక పుట్టించాల్సిందే. ఇదీ అభిమానుల ఆరాటం.. కోలాహలం.. సరిగ్గా ఈ ఆరాటాన్నే నగరంలోని కీలక నేత కుటుంబం అడ్డంగా వాడేసుకుంటోంది. అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు అక్రమ కలెక్షన్ల షోకు తెగించింది. ఇసుక, మద్యం మాఫియాలను మించిపోయేలా... క్రికెట్ బెట్టింగులనూ తలదన్నేలా... జిల్లాలో సరికొత్త సినీ వ్యాపారానికి తెరతీసింది. గతంలో బాహుబలి సినిమాతో ప్రారంభించిన ఆ దందాను సర్దార్ గబ్బర్ సింగ్తో రెట్టింపు చేసింది. వెండితెర సాక్షిగా తొలి మూడు రోజుల్లో నగరంలో రూ. 33.75 కోట్లు... గ్రామీణ జిల్లాలో రూ. 15 కోట్లు వసూళ్ల దందాకు తెరతీసింది.

    విశాఖపట్నం : పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ శుక్రవారం విడుదల కావడంతో ఆయన అభిమానుల్లో కోలాహలం కట్టలు తెంచుకుంటోంది. జిల్లాలో సుమారు 50 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. పెద్ద హీరో సినిమా అయినందున ఓపెనింగ్ కలెక్షన్లకు కొదవ ఉండదు. ఈ కలెక్షన్లను సొంతం చేసుకునేందుకు నగరంలోని అధికార పార్టీకి చెందిన కీలక నేత కుటుంబం రంగంలోకి దిగింది. ఈ సినిమా విడుద రోజైన శుక్రవారం ఉగాది సెలవు.. ఆ వెంటనే శని, ఆదివారం కూడా కలసి వచ్చాయి.

    దాంతో ఆ మూడు రోజుల కలెక్షన్లపై కీలక నేత కుటుంబం కన్నేసింది. ఆ కుటుంబ సభ్యులు థియేటర్ల యజమానులతో వారం రోజుల ముందే చర్చలు జరిపారు. సామదానభేదదండోపాయాలతో వారిని ఒప్పించారు. అధికార బలం, పోలీసు బెదిరింపులనూ ప్రయోగించారు. థియేటర్ల నిర్వహణ యజమానులదే... కానీ షోలు మాత్రం తాము వేసుకుంటామని తేల్చి చెప్పేశారు.

    అందుకుగాను షోకు హాల్ కెపాసిటీని బట్టి టికెట్ల వాస్తవ రేటు సొమ్ము ఇచ్చేస్తామని చెప్పారు. అక్కడే ఉంది అసలు కిటుకు. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకు తొలి వారం టిక్కెట్టు ధరను రూ. 100 వరకు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఆ ప్రకారం థియేటర్ యజమానులకు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ లెక్కన షోకు సగటున 1500 టిక్కెట్లు ఉంటాయి. అందులో 20 శాతం ఇంటర్నెట్ ద్వారా విక్రయించాలి. మిగిలిన టిక్కెట్లు కౌంటర్లలోనే అమ్మాలి. కానీ కీలక నేత కుటుంబం గంపగుత్తగా టిక్కెట్లు సొంతం చేసుకుంది. ఆ టిక్కెట్ల ధరను భారీగా పెంచేసి అడ్డంగా సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైంది.

    3 రోజుల్లో దాదాపు రూ. 50 కోట్ల దోపిడీకి స్కెచ్
    అలా దక్కించుకున్న టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్కు సిద్ధపడింది కీలక నేత కుటుంబం. ఒక్కో టిక్కెట్టును రూ. 500 చొప్పున బ్లాక్లో విక్రయం ప్రారంభించింది.  అంతలోనే దాన్ని రూ. 1000కి, చివరికి రూ. 2000 వరకు పెంచుకుంటూ పోయింది. జిల్లాలో 50 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వాటిలో 30 థియేటర్లు నగరంలోనే ఉన్నాయి.

    ప్రతి థియేటర్లో  తొలి మూడు  రోజులు 5 షోలు చొప్పున వేస్తున్నారు. ఒక్కో షోకు సగటున 1500 టిక్కెట్లు... అంటే రోజుకు 225000 టిక్కెట్లు, ఒక్కో టిక్కెట్టు రూ. 500 చొప్పున వేసుకున్నా... రోజుకు రూ. 11.25 కోట్ల అక్రమార్జన... దిమ్మ తిరిగే భారీ అక్రమం కదా... ఆ ప్రకారం తొలి మూడు రోజుల్లో రూ. 33.75 కోట్ల అక్రమార్జనకు కీలక నేత కుటుంబం బరి తెగించింది. గ్రామీణ జిల్లాలో పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అక్కడ కూడా  రోజుకు దాదాపు రూ. 5 కోట్లు చొప్పున తొలి మూడు రోజుల్లో రూ. 15 కోట్ల వరకు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు.

    చెష్టలుడిగిన అధికార యంత్రాంగం
    ప్రేక్షకుల సినీ వ్యామోహాన్ని ఇంతగా దోచుకుంటున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి పోయింది. కీలక నేత కుటుంబ సభ్యులే స్వయంగా రంగంలోకి దిగి దందా సాగిస్తుండటంతో మౌనంగా ఉండిపోయింది. సినిమా థియేటర్ల సక్రమ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన జాయింట్ కలెక్టర్ గానీ బ్లాక్ విక్రయాలను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం గానీ కిమ్మనడం లేదు. వారి ఉదాసీనత కీలక నేత కుటుంబ భారీ అక్రమాలకు రక్షావకచంగా నిలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement