ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'సెలైన్' బంద్
‘సరోజినీ’ ఎఫెక్ట్
* ఆ బాటిళ్లు వాడొద్దని సర్కారు ఉత్తర్వులు
* బయట నుంచి తెచ్చుకుంటున్న రోగులు
* ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు
భువనగిరి : సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఘటన ప్రభావం జిల్లా ఆస్పత్రులపై పడింది. సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఆర్‌ఎస్, సాధారణ సెలైన్ బాటిళ్లను రోగులకు ఎక్కించవద్దని ప్రభుత్వ ఆదేశాలు అందాయి. దీంతో రోగులకు అవసరమైన సెలైన్ బాటిళ్లను బయట తెచ్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో నిల్వ ఉన్న సెలైన్ బాటిళ్లను ఎక్కించడం లేదు.
హైదరాబాద్ సరోజినీ దేవి ఆస్పత్రి ఘటనలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలోని గ్లూకోజ్ బాటిళ్ల శాంపిల్స్ సేకరించారు. వాటిలో ఫంగస్ లణాలు కన్పించడంతో వెంటనే వాటి వాడకం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క జిల్లాలో కురుస్తున్న ముసురు వర్షాలు, చల్లని గాలులతో జన ం వైరల్ ఫీవర్, అతిసార, టైఫాయిడ్, ఇతర రోగాల బారిన పడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో అస్పత్రుల్లో చేరిన వారికి ముందుగా సె లైన్ బాటిళ్లను ఎక్కిస్తారు. అనంతరం వైద్యం అందిస్తారు. అయితే సరోజినీ కంటి ఆస్పత్రి ఘనతో అస్పత్రుల్లో సైలైన్‌లు ఎక్కించడానికి బయట మెడికల్ దుకాణాల నుంచి కొనుగోలు చేసుకోవాలని వైద్యులు చీటీలు రాస్తున్నారు. దీంతో రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
జిల్లా అంతటా హసీబ్ కంపెనీ ఫ్లూయిడ్స్...
హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో రోగుల కళ్లు పోవడానికి కారణమని భావిస్తున్న హసీబ్ పార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన సెలైన్ బాటిళ్లు జిల్లా అస్పత్రుల్లో ఉన్నాయి. జిల్లాలోని 72 పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలో 200 పడకలు, నాగార్జున సాగర్‌లో 150 పడకలు, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడల్లో 100 పడకలు, దేవరకొండ, రామన్నపేట, హుజూర్‌నగర్‌లో 50 పడకలు, చౌటుప్పల్, ఆలేరు, నకిరెకల్‌లో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి.
ఈ ఆస్పత్రుల్లో హసీబ్ కంపెనీకి చెందిన ఆర్‌ఎల్, ఎన్‌ఎస్ గ్లూకోజ్ బాటిళ్లను వాడుతున్నారు. ఆ కంపెనీకి చెందిన గ్లూకోజ్ బాటిళ్లలో ఫంగస్ (బూజు) రావడంతో రోగులకు కళ్లుపోయాయని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉన్న స్టాక్ ఈ సెలైన్ల వాడకం ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఆదేశాలు అందాయి.
రోగులపై భారం..
ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలో వందలాది మంది మంచాన పడుతున్నారు. దగ్గు, జలుబు, చలిజ్వరం, అతిసార, డయేరియా వంటి వ్యాధులు సోకుతున్నాయి. ఈ పరిస్థితిలో రోగులకు అత్యంత అవసరమైన గ్లూకోజ్ బాటిళ్లు ప్రభుత్వ అస్పత్రుల్లో అందుబాటులో లేకుండా పోయాయి. ఒక్కోసారి రోగికి 5 నుంచి 20 బాటిళ్ల వరకు ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలమంది రోగులకు బయట నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. తప్పని సరిపరిస్థితిలో వందలాది రూపాయలు గ్లూకోజ్ బాటిళ్ల కోసం ఖర్చు చేయాల్సివస్తోంది.