నేటి నుంచి సత్యసాయి జయంతి వేడుకలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు,
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వైద్య శిబిరాలు, తాగునీటి కేంద్రాలు
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా 91వ జయంతి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌లు ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపట్టాయి. దేశ, విదేశాల నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు తరలిరానుండడంతో ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక వైద్యశిబిరాలు, తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నారు.
ప్రత్యేక నిఘా..
జయంతి వేడుకల కోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, పుట్టపర్తి పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేడుకల జరిగే రోజుల్లో నిరంతర పర్యవేక్షించేందుకు గోకులంలోని డీఎస్పీ గెస్ట్ హౌస్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 400 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని భద్రతా ఏర్పాట్లకు కేటాయించారు.
భద్రతా ఏర్పాట్ల కోసం విచ్చేసిన సిబ్బందికి గురువారం సాయంత్రం గోకులంలోని డ్వాక్రా బజార్ వద్ద డీఎస్సీ ముక్కాశివరామిరెడ్డి సమీక్ష నిర్వహించి, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 350 మంది సిబ్బందిని నియమించామన్నారు.ఇందులో రద్దీ నియంత్రణకు రోప్‌పార్టీలు, ట్రాఫిక్ కంట్రోల్ పార్టీలు, సెక్యురిటీ, పెట్రోలింగ్, డాగ్‌స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్వాడ్‌లు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, కర్ణాటక నాగేపల్లి, పుట్టపర్తి బస్ డిపో వద్ద చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాన్నారు.
ప్రత్యేక వైద్య సౌకర్యాలు
వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో పలు ప్రాంతాల్లో భక్తుల కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 17 మంది వైద్యులు, 63 మంది సిబ్బందిని నియమించారు.ఒక 104, రెండు 108 వాహనాలతోపాటు మొబైల్ టీంను సిద్దంగా ఉంచారు.
పారిశుద్ధ్య చర్యలు
భక్తుల సౌకర్యార్థం నగర పంచాయతీ అధికారులు, కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఎనుములపల్లి మార్కెట్ వద్ద సత్యసాయి మైదానం, కమ్మవారిపల్లి చింతతోపుల వద్ద, కర్ణాటక నాగేపల్లి వద్ద వాహనదారుల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు.పట్టణంలోని హనుమాన్ సర్కిల్, విద్యాగిరి, గోకులం, చిత్రావతి రోడ్డు, సంగీత కళాశాల, చిత్రావతి ఘాట్, వెస్ట్‌గేట్, తహశీల్దార్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బస్సులు..
భక్తుల కోసం ఆర్టీసీ వివిధ ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసిందని పుట్టపర్తి డీఎం రమణయ్య తెలిపారు. ప్రధానంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామన్నారు.ధర్మవరం, పుట్టపర్తి రైల్వేష్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు. వేడుకల కోసం ప్రత్యేకకంగా 135 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశాన్నారు.
వేణుగోపాల్ స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభం
సత్యసాయి 91వ జయంతి వేడుకలు శుక్రవారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభం కానున్నాయి.వేడుకల కోసం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వం సిద్దం చేశారు. ప్రశాంతి నిలయం ఉత్తర గోపురాన్ని ప్రత్యేకంగా అలకంరించారు. ఉదయం 8 గంటలకు ఉత్తర గోపురం వద్ద రథోత్సవాన్ని సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ప్రారంభించనున్నారు. తొలుత పెదవెంకమరాజు కల్యాణమండపం వద్ద ప్రత్యేకంగా అలంకరింపబడిన రథాన్ని ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చి, సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి చెంత ఉత్సవమూర్తులైన వేణుగోపాల్ స్వామి, సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథోత్సవాన్ని ప్రారంభించనున్నారు.