సత్యదేవా... ఇదేమి మోత
-
∙ఆదాయం కోసం... పెళ్లిబాజాకు టెండర్ !
-
∙అధికారుల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
-
∙పెళ్లి బృందాలపై మరింత భారం
-
∙భక్తుల్లో భయం...భయం
సత్యదేవుని సన్నిధిలో జరిగే వివాహ వేడుకలు భారం కానున్నాయా... బాజా భజంత్రీలకు టెండర్ వేయడానికి పాలకవర్గం పాల్పడుతుండడంతో సన్నాయి మేళంకు ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తారేమోనని భయం భక్తుల్లో నెలకొంది. అన్నవరం దేవస్థానంలో ఏటా ఐదు వేల వివాహాలు జరుగుతుంటాయని అంచనా. మధ్య తరగతి, పేదవర్గాలు చేసుకునే వివాహాలే దాదాపు 90 శాతం ఉంటాయి. దేవస్థానంలో ఉండే వాయిద్యకారులకే ఎంతోకొంత మొత్తం చెల్లించి వివాహ తంతు జరిపించేసుకునేవారు. ఇదే విధానం శతాబ్దాలుగా సాగుతోంది. ఒకప్పుడు సత్యదేవుని దర్శనం అంటే తక్కువ ఖర్చుతో జరిగే తీర్థయాత్ర అనేవారు. కానీ ఇప్పుడు
ఆ పరిస్థితి మారిపోయింది. తిరుపతి కొండమీద కూడా ఇంతఖర్చు ఉండదేమో అనే రీతిలో దేవస్థానంలో ప్రతీదీ డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టోల్‌గేట్ వద్ద మొదలయ్యే వసూళ్ల పర్వం వాహనాల పార్కింగ్, వ్రతాలు, అంతరాలయ దర్శనం, యంత్రాలయం లోపల దర్శనం, ఇలా సాగిపోతోంది. ఎన్ని కోట్ల ఆదాయం తెచ్చామనే లెక్క తప్ప దీని వలన భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయనే ఆలోచనే అధికారులకు ఉండడం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. – అన్నవరం
పెళ్లిబాజా కూడా కాంట్రాక్ట్
తాజాగా పెళ్లిళ్లలో ఉపయోగించే బాజాభజంత్రీలు వాయించే వాయిద్యకారులను సరఫరా చేసేందుకు కూడా టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించాలనుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేవస్థానానికి కొంత ఆదాయం పెరిగినా తమ ఉపాధి దెబ్బతింటుందేమోనన్న భయం వాయిద్యకారుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే దేవస్థానం పురోహితులు వ్రతాల డ్యూటీ సమయంలో వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ చేయకూడదని అధికారులు ఆంక్షలు విధించడంపై కూడా పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
90 శాతం మధ్యతరగతి, పేదవర్గాల పెళిళ్లే్ల
అన్నవరం దేవస్థానంలో 90 శాతం మధ్యతరగతి, పేదవర్గాల వివాహాలే జరుగుతుంటాయి. వీటిలో ఎక్కువ వివాహాలు ఆరుబయటే జరుగుతాయి. వీరు దేవస్థానంలో ఉండే వాయిద్యకారులకే ఎంతోకొంత మొత్తం చెల్లించి బాజాభజంత్రీలు వాయించేలా ఏర్పాటు చేసుకుంటారు
పాటదారునిదే గుత్తాధిపత్యం
టెండర్ కం వేలం ద్వారా సన్నాయిమేళం ఏర్పాటు చేసే అధికారం పాటదారునికి వస్తే అతడు నిర్ణయించిందే రేటు అవుతుంది. దేవస్థానం రేట్లు నిర్ణయించినా అవి అమలయ్యే పరిస్థితి ఉండదు. ఉదాహరణకు దేవస్థానంలో పూజాద్రవ్యాలు కానీ, శీతలపానీయాలు కానీ, తినుబండారాలు కానీ దేవస్థానం నిర్ణయించిన రేట్ల కన్నా ఎక్కువకు విక్రయిస్తారు. భక్తుడెవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే తాము రూ.లక్షలు పెట్టి వేలం పాడుకున్నామని దేవస్థానానికి ఆ సొమ్ము కట్టాలంటే ఈ విధంగా విక్రయించక తప్పదంటారు. ఇపుడు దేవస్థానం నిర్ణయించే సన్నాయి మేళం రేట్లు కూడా అంతే. దేవస్థానం ఈ టెండర్ షెడ్యూల్‌లో ఇద్దరు వాయిద్యకారులు ఉంటే రూ.వేయి, సన్నాయి వాయించే వారుంటే రూ.మూడు వేలు, ఆరుగురితో కూడిన బ్యాండ్ అయితే రూ.ఐదు వేలు వసూలు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే పాటదారుడు ఇవే రేట్లు పెళ్లి బృందాల నుంచి వసూలు చేస్తాడని చెప్పలేమని, ఎక్కువ రేట్లు వసూలు చేస్తే పెళ్లి బృందాలు ఇబ్బంది పడతారని అంటున్నారు. అంతే గాక, పెళ్లి బృందాల వారు సొంతంగా సన్నాయిమేళం బృందాన్ని కూడా తెచ్చుకోవచ్చని అధికారులు చెబుతున్నా పాటదారుడు అందుకు అంగీకరిస్తాడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకుముందులా పెళ్లి బృందాలతో నేరుగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. పాటదారుడి ఆదేశాల మేరకే వ్యవహరించాలి. పాటదారుడు ఎంతిస్తే అంతే తీసుకోవాలి. తప్ప డిమాండ్ చేయడానికి ఉండదు
అంటున్నారు.
పురోహితులది మరో ఆవేదన
అయితే వ్రతాల సమయంలో దేవస్థానంలో వివాహాలు, ఉపనయనాలు చేయించకూడదని, అలా చేయించినవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు ఆంక్షలు విధించడంపై కూడా పురోహితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్రతాల సమయంలో అక్షరాభ్యాసం, అన్నప్రాశన, నామకరణం చేయించడానికి పురోహితులు కావాలి కాని వివాహాలు, ఉపనయనాలు చేయించకూడదు. ఇదేమి రూలు అని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానంలో 40 ఏళ్లుగా ఇదే విధంగా చేయిస్తున్నామని, వ్రతాలు ఆగితే అధికారులు అడగాలని పురోహితులు అంటున్నారు. దీనిపై ఈఓ కలిసేందుకు వారు సమాయత్తమవుతున్నారు.
బోర్డులు పెడతాం
సన్నాయి మేళం పాటదారుడు దేవస్థానం నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేకుండా బోర్డులు పెడతాం. నిర్ణయించిన ధరకన్నా ఏమాత్రం ఎక్కువ వసూలు చేసినా చర్య తీసుకుంటాం.
– కె.నాగేశ్వరరావు, ఈఓ