tendar
-
టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? ఎన్వలప్లో ఓటు ఎందుకు ప్యాక్ చేస్తారు?
దేశంలో ప్రతి సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, మధ్యలో లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. వన్ కంట్రీ- వన్ ఎలక్షన్ లేదా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈవీఎం వినియోగానికి బదులుగా ఎన్వలప్ ఉపయోగించే ఓటింగ్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానాన్నే టెండర్ ఓటింగ్ అని అంటారు. భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు హక్కు భారతదేశంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రధాన హక్కులలో ఒకటిగా పరిగణిస్తారు. దేశపౌరుడు వేసే ఓటు అటు దేశ, ఇటు సమాజ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈ అధికారాన్ని వినియోగించుకోవాలి. అయితే ఓటింగ్ సమయంలో చాలాసార్లు నకిలీ ఓట్లు కనిపిస్తుంటాయి. ఒకరి ఓటును మరొకరు వేసేస్తుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే టెండర్ ఓటింగ్ అనే నిబంధన ఉంది. పోలింగ్ జరుగుతున్న రోజున మీరు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు మీ ఓటు ఇప్పటికే ఎవరో వినియోగించారని చెప్పారనుకోండి. అటువంటి పరిస్థితిలో మీరు టెండర్ ఓటింగ్ ద్వారా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? దీని కోసం ముందుగా మీరు మీ గుర్తింపు కార్డుతో పోలింగ్ బూత్‌లోనే ఉన్న ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లాలి. మీరు ఓటు వేయలేదని ముందుగా వారికి చెప్పాలి. అప్పుడు వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కొన్ని పత్రాలు కూడా అడగవచ్చు. ఇది పూర్తయిన తర్వాత మీరు మీ ఓటు వినియోగించుకునేందుకు అనుమతి పొందుతారు. అటువంటి సందర్భంలో మీరు ఈవీఎంలపై ఓటు వేయనప్పటికీ, బ్యాలెట్ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే టెండర్ ఓటింగ్ అంటారు. అటువంటప్పుడు మీకు అన్ని పార్టీల అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులు ఉండే ఒకపత్రం అందజేస్తారు. అప్పుడు మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారో అదే స్లిప్‌లో టిక్ చేయాలి. దీని తరువాత ప్రిసైడింగ్ అధికారి ఆ స్లిప్‌ను ఒక కవరులో సీలు చేసి, పెట్టెలో భద్రపరచి, కౌంటింగ్ రోజున దానిని లెక్కిస్తారు. ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? -
రామోజీరావు బంధువు కేసులో బయటపడ్డ వాస్తవాలు
సాక్షి, చెన్నై: టెండర్‌ను దక్కించుకోవడం కోసం లోపాయికారీతనంగా దళారీ ద్వారా జరిపిన పంచాయితీనే రామోజీరావు బంధువు రవిచంద్రన్ (47) కిడ్నాప్‌నకు దారితీసినట్లు తెలిసింది. ఈ కేసులో ముగ్గురు అరెస్ట్‌కాగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుని కోసం చెన్నై అన్నానగర్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు, విశ్వసనీయ వర్గాల కథనం ఇలా ఉంది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కోడలు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్ మేనమామకు అల్లుడైన రవిచంద్రన్ ప్రజాపనుల శాఖ కాంట్రాక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 2వ తేదీ ఉదయం చెన్నై అన్నానగర్‌లోని టవర్‌పార్కులో జాగింగ్ ముగించుకుని ఇంటికి నడిచి వెళుతుండగా అన్నానగర్ శాంతికాలనీ సమీపంలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి రవిచంద్రన్‌పై దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. పట్టపగలు జరిగిన ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన పరిసరాలు ప్రజలు పోలీసు కంట్రోలు రూముకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రవిచంద్రన్‌ను రక్షించారు. కారులోని ఇద్దరు వ్యక్తులు పారిపోగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. మరో వ్యక్తి శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో పురుషోత్తమన్, దినేష్, జ్యోతికుమార్ అనే నిందితులను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ జాఫర్ హుస్సేన్ తెలిపారు. ప్రధాన నిందితుడైన జయకుమార్ కోసం గాలిస్తున్నారు. టెండర్ దక్కించుకోవడం కోసం.. తమిళనాడు ప్రభుత్వ ప్రజాపనుల శాఖ కాంట్రాక్టరుగా ఉన్న రవిచంద్రన్ కొన్ని కోట్ల రూపాయల పనులను చేస్తున్నారు. అవే పనులకు మరో వ్యక్తి కూడా టెండర్ వేశారు. పోటీ టెండర్‌ను ఉపసంహరించుకునేలా చేసి ఈ పనులను దక్కించుకోవాలని భావించిన రవిచంద్రన్ ఇందుకోసం జయకుమార్ అనే దళారీని ఆశ్రయించాడు. జయకుమార్ పోటీ టెండర్‌దారుతో సంప్రదింపులు జరిపి రవిచంద్రన్ ద్వారా కొంత సొమ్ము ముట్టజెప్పేట్లుగా టెండర్ ఉపసంహరణకు ఒప్పించాడు. ఒప్పందం మేరకు రవిచంద్రన్ పోటీదారుకు డబ్బు చెల్లించాడు. ఈ లావాదేవీల్లో కీలకపాత్ర పోషించిన జయకుమార్ తన వాటాగా రవిచంద్రన్ ద్వారా దక్కుతుందని ఆశించి భంగపడ్డాడు. దీంతో ఆగ్రహించిన జయకుమార్ డబ్బు రాబట్టుకునేందుకు తన స్నేహితులతో కలిసి రవిచంద్రన్‌ను కిడ్నాప్ చేశాడు. అయితే పోటీ టెండర్‌దారుతో నేరుగా సంప్రదింపులు జరిపిన మాటవాస్తవమే, కానీ జయకుమార్ ఎవరో కూడా నాకు తెలియదు, అతనితో ఎలాంటి సంబంధం లేదని రవిచంద్రన్ వాదిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరిన తరువాత ఇరుపక్షాలు రాజీమార్గాన్ని ఎంచుకుని కేసులేవీ వద్దని పోలీసులకు చెప్పుకున్నారు. అయితే స్థానికులు కిడ్నాప్ సంఘటనపై కంట్రోలు (ఫోన్ నంబర్ – 100) రూముకు సమాచారం ఇవ్వడం వల్ల పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి ఉండడంతో రాజీయత్నాలు ఫలించలేదు. అన్నానగర్ పోలీసులు సైతం గత్యంతరం లేక కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
సత్యదేవా... ఇదేమి మోత
∙ఆదాయం కోసం... పెళ్లిబాజాకు టెండర్ ! ∙అధికారుల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ∙పెళ్లి బృందాలపై మరింత భారం ∙భక్తుల్లో భయం...భయం సత్యదేవుని సన్నిధిలో జరిగే వివాహ వేడుకలు భారం కానున్నాయా... బాజా భజంత్రీలకు టెండర్ వేయడానికి పాలకవర్గం పాల్పడుతుండడంతో సన్నాయి మేళంకు ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తారేమోనని భయం భక్తుల్లో నెలకొంది. అన్నవరం దేవస్థానంలో ఏటా ఐదు వేల వివాహాలు జరుగుతుంటాయని అంచనా. మధ్య తరగతి, పేదవర్గాలు చేసుకునే వివాహాలే దాదాపు 90 శాతం ఉంటాయి. దేవస్థానంలో ఉండే వాయిద్యకారులకే ఎంతోకొంత మొత్తం చెల్లించి వివాహ తంతు జరిపించేసుకునేవారు. ఇదే విధానం శతాబ్దాలుగా సాగుతోంది. ఒకప్పుడు సత్యదేవుని దర్శనం అంటే తక్కువ ఖర్చుతో జరిగే తీర్థయాత్ర అనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. తిరుపతి కొండమీద కూడా ఇంతఖర్చు ఉండదేమో అనే రీతిలో దేవస్థానంలో ప్రతీదీ డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టోల్గేట్ వద్ద మొదలయ్యే వసూళ్ల పర్వం వాహనాల పార్కింగ్, వ్రతాలు, అంతరాలయ దర్శనం, యంత్రాలయం లోపల దర్శనం, ఇలా సాగిపోతోంది. ఎన్ని కోట్ల ఆదాయం తెచ్చామనే లెక్క తప్ప దీని వలన భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయనే ఆలోచనే అధికారులకు ఉండడం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. – అన్నవరం పెళ్లిబాజా కూడా కాంట్రాక్ట్ తాజాగా పెళ్లిళ్లలో ఉపయోగించే బాజాభజంత్రీలు వాయించే వాయిద్యకారులను సరఫరా చేసేందుకు కూడా టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించాలనుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేవస్థానానికి కొంత ఆదాయం పెరిగినా తమ ఉపాధి దెబ్బతింటుందేమోనన్న భయం వాయిద్యకారుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే దేవస్థానం పురోహితులు వ్రతాల డ్యూటీ సమయంలో వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ చేయకూడదని అధికారులు ఆంక్షలు విధించడంపై కూడా పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 90 శాతం మధ్యతరగతి, పేదవర్గాల పెళిళ్లే్ల అన్నవరం దేవస్థానంలో 90 శాతం మధ్యతరగతి, పేదవర్గాల వివాహాలే జరుగుతుంటాయి. వీటిలో ఎక్కువ వివాహాలు ఆరుబయటే జరుగుతాయి. వీరు దేవస్థానంలో ఉండే వాయిద్యకారులకే ఎంతోకొంత మొత్తం చెల్లించి బాజాభజంత్రీలు వాయించేలా ఏర్పాటు చేసుకుంటారు పాటదారునిదే గుత్తాధిపత్యం టెండర్ కం వేలం ద్వారా సన్నాయిమేళం ఏర్పాటు చేసే అధికారం పాటదారునికి వస్తే అతడు నిర్ణయించిందే రేటు అవుతుంది. దేవస్థానం రేట్లు నిర్ణయించినా అవి అమలయ్యే పరిస్థితి ఉండదు. ఉదాహరణకు దేవస్థానంలో పూజాద్రవ్యాలు కానీ, శీతలపానీయాలు కానీ, తినుబండారాలు కానీ దేవస్థానం నిర్ణయించిన రేట్ల కన్నా ఎక్కువకు విక్రయిస్తారు. భక్తుడెవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే తాము రూ.లక్షలు పెట్టి వేలం పాడుకున్నామని దేవస్థానానికి ఆ సొమ్ము కట్టాలంటే ఈ విధంగా విక్రయించక తప్పదంటారు. ఇపుడు దేవస్థానం నిర్ణయించే సన్నాయి మేళం రేట్లు కూడా అంతే. దేవస్థానం ఈ టెండర్ షెడ్యూల్లో ఇద్దరు వాయిద్యకారులు ఉంటే రూ.వేయి, సన్నాయి వాయించే వారుంటే రూ.మూడు వేలు, ఆరుగురితో కూడిన బ్యాండ్ అయితే రూ.ఐదు వేలు వసూలు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే పాటదారుడు ఇవే రేట్లు పెళ్లి బృందాల నుంచి వసూలు చేస్తాడని చెప్పలేమని, ఎక్కువ రేట్లు వసూలు చేస్తే పెళ్లి బృందాలు ఇబ్బంది పడతారని అంటున్నారు. అంతే గాక, పెళ్లి బృందాల వారు సొంతంగా సన్నాయిమేళం బృందాన్ని కూడా తెచ్చుకోవచ్చని అధికారులు చెబుతున్నా పాటదారుడు అందుకు అంగీకరిస్తాడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకుముందులా పెళ్లి బృందాలతో నేరుగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. పాటదారుడి ఆదేశాల మేరకే వ్యవహరించాలి. పాటదారుడు ఎంతిస్తే అంతే తీసుకోవాలి. తప్ప డిమాండ్ చేయడానికి ఉండదు అంటున్నారు. పురోహితులది మరో ఆవేదన అయితే వ్రతాల సమయంలో దేవస్థానంలో వివాహాలు, ఉపనయనాలు చేయించకూడదని, అలా చేయించినవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు ఆంక్షలు విధించడంపై కూడా పురోహితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్రతాల సమయంలో అక్షరాభ్యాసం, అన్నప్రాశన, నామకరణం చేయించడానికి పురోహితులు కావాలి కాని వివాహాలు, ఉపనయనాలు చేయించకూడదు. ఇదేమి రూలు అని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానంలో 40 ఏళ్లుగా ఇదే విధంగా చేయిస్తున్నామని, వ్రతాలు ఆగితే అధికారులు అడగాలని పురోహితులు అంటున్నారు. దీనిపై ఈఓ కలిసేందుకు వారు సమాయత్తమవుతున్నారు. బోర్డులు పెడతాం సన్నాయి మేళం పాటదారుడు దేవస్థానం నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేకుండా బోర్డులు పెడతాం. నిర్ణయించిన ధరకన్నా ఏమాత్రం ఎక్కువ వసూలు చేసినా చర్య తీసుకుంటాం. – కె.నాగేశ్వరరావు, ఈఓ