సాక్షి, చెన్నై: టెండర్‌ను దక్కించుకోవడం కోసం లోపాయికారీతనంగా దళారీ ద్వారా జరిపిన పంచాయితీనే రామోజీరావు బంధువు రవిచంద్రన్ (47) కిడ్నాప్‌నకు దారితీసినట్లు తెలిసింది. ఈ కేసులో ముగ్గురు అరెస్ట్‌కాగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుని కోసం చెన్నై అన్నానగర్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు, విశ్వసనీయ వర్గాల కథనం ఇలా ఉంది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కోడలు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్ మేనమామకు అల్లుడైన రవిచంద్రన్ ప్రజాపనుల శాఖ కాంట్రాక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 2వ తేదీ ఉదయం చెన్నై అన్నానగర్‌లోని టవర్‌పార్కులో జాగింగ్ ముగించుకుని ఇంటికి నడిచి వెళుతుండగా అన్నానగర్ శాంతికాలనీ సమీపంలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి రవిచంద్రన్‌పై దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. పట్టపగలు జరిగిన ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన పరిసరాలు ప్రజలు పోలీసు కంట్రోలు రూముకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రవిచంద్రన్‌ను రక్షించారు. కారులోని ఇద్దరు వ్యక్తులు పారిపోగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. మరో వ్యక్తి శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో పురుషోత్తమన్, దినేష్, జ్యోతికుమార్ అనే నిందితులను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ జాఫర్ హుస్సేన్ తెలిపారు. ప్రధాన నిందితుడైన జయకుమార్ కోసం గాలిస్తున్నారు.
టెండర్ దక్కించుకోవడం కోసం..
తమిళనాడు ప్రభుత్వ ప్రజాపనుల శాఖ కాంట్రాక్టరుగా ఉన్న రవిచంద్రన్ కొన్ని కోట్ల రూపాయల పనులను చేస్తున్నారు. అవే పనులకు మరో వ్యక్తి కూడా టెండర్ వేశారు. పోటీ టెండర్‌ను ఉపసంహరించుకునేలా చేసి ఈ పనులను దక్కించుకోవాలని భావించిన రవిచంద్రన్ ఇందుకోసం జయకుమార్ అనే దళారీని ఆశ్రయించాడు. జయకుమార్ పోటీ టెండర్‌దారుతో సంప్రదింపులు జరిపి రవిచంద్రన్ ద్వారా కొంత సొమ్ము ముట్టజెప్పేట్లుగా టెండర్ ఉపసంహరణకు ఒప్పించాడు. ఒప్పందం మేరకు రవిచంద్రన్ పోటీదారుకు డబ్బు చెల్లించాడు. ఈ లావాదేవీల్లో కీలకపాత్ర పోషించిన జయకుమార్ తన వాటాగా రవిచంద్రన్ ద్వారా దక్కుతుందని ఆశించి భంగపడ్డాడు. దీంతో ఆగ్రహించిన జయకుమార్ డబ్బు రాబట్టుకునేందుకు తన స్నేహితులతో కలిసి రవిచంద్రన్‌ను కిడ్నాప్ చేశాడు.
అయితే పోటీ టెండర్‌దారుతో నేరుగా సంప్రదింపులు జరిపిన మాటవాస్తవమే, కానీ జయకుమార్ ఎవరో కూడా నాకు తెలియదు, అతనితో ఎలాంటి సంబంధం లేదని రవిచంద్రన్ వాదిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరిన తరువాత ఇరుపక్షాలు రాజీమార్గాన్ని ఎంచుకుని కేసులేవీ వద్దని పోలీసులకు చెప్పుకున్నారు. అయితే స్థానికులు కిడ్నాప్ సంఘటనపై కంట్రోలు (ఫోన్ నంబర్ – 100) రూముకు సమాచారం ఇవ్వడం వల్ల పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి ఉండడంతో రాజీయత్నాలు ఫలించలేదు. అన్నానగర్ పోలీసులు సైతం గత్యంతరం లేక కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment