సేవ్ డెమోక్రసీ ప్రదర్శనలు
► నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు
► పాల్గొన్న పార్టీశ్రేణులు, పౌరులు
► చంద్రబాబు పై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ద్వజం
శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం ఉదయం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బైక్ ర్యాలీలు, నిరసన ర్యాలీల సన్నద్ధతపై పార్టీ జిల్లా నాయకులతో రెడ్డి శాంతి శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సమాలోచనలు చేశారు. ప్రభుత్వ దుర్మార్గపు విధానాలను ప్రజలకు ఏవిధంగా వివరించాలి, చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలను ఏవిధంగా ఎండగట్టాలి... అనే విషయాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలతో టీడీపీలోకి చేర్పించుకున్నారని విమర్శించారు. వారిలో నలుగురికి మంత్రి పదవులూ నిస్సిగ్గుగా కట్టబెట్టారన్నారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం పాలుచేసేలా వ్యవహరించిన చంద్రబాబును గవర్నరు సైతం మందలించకపోగా వత్తాసు పలకడం అన్యాయమన్నారు. చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధ పనులను వ్యతిరేకించి టీడీపీ ప్రభుత్వ మెడలు వంచేందుకు శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బైక్‌ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అంధవరపు వరహానరసింహం, ఎంవీ పద్మావతి, కోణార్క్ శ్రీను, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, గుమ్మా నగేష్, సాధు వైకుంఠరావు, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, పి.జీవరత్నం, మూకళ్ళ తాతబాబు, గొండు కృష్ణ, పీస శ్రీహరి, పొన్నాడ రుషి, పడపాన సుగుణారెడ్డి, పప్పు పొట్టెమ్మ, కె.చంద్రకళ, ఆదిత్య శ్రీను, దున్న దేవా తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీ సాగేదిలా....: జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులన్నీ తొలుత బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం స్థానిక ఆర్డీవో లేదా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొంటాయి. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఉదయం 9.30 గంటలకు బైక్‌ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ జీటీ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ చేరుకొని, అక్కడి నుంచి పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు.