ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్ బీహెచ్) బ్యాంకులో రూ.2.65 కోట్లు మాయమయ్యాయి. కాగా బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగే డబ్బును దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడు. బ్యాంకు మేనజర్ సత్యానందం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు పరిధిలో ట్రెజరీ ద్వారా నిర్వహించే నిధులు, లావాదేవీలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఆర్ధిక కార్యకలాపాలన్నీ ప్రత్తిపాడు ఎస్ బీహెచ్ ద్వారానే జరుగుతాయి.
అయితే ఈ లావాదేవీల్లో పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లినట్లు ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకూ నిర్వహించిన లెక్కల్లో తేలిందని చెప్పారు. దీంతో ట్రెజరీ, ఇతరత్రా బ్యాంకు కార్యకలాపాల్లో చురుకుగా ఉండే బ్యాంకు సబ్ స్టాఫర్ ఎడ్ల ఉషా సత్య సూర్య వెంకట రాకేష్ అలియాస్ చిన్నాపై అనుమానం వచ్చినట్లు తెలిపారు. అతని అకౌంట్ లావాదేవీలను పరిశీలించి చూడగా రూ.2.65కోట్లను బినామీల ఖాతాలకు దారి మళ్లించినట్లు తేలిందని చెప్పారు.
అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో 29 బినామీ ఖాతాలు తెరిచినట్లు పేర్కొన్నారు. వాటిలోకి డబ్బును జమ చేసినట్లు చెప్పారు. ఒక్కో ఖాతాకు లక్ష రూపాయలకు పైనే జమ చేసినట్లు తెలిపారు. కాగా దారి మళ్లించిన సొమ్మును వెనక్కు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ రూ.1.38కోట్ల నిధులు వెనక్కురాబట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ట్రెజరీస్ డీడీ విచారణ
నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో ట్రెజరీ ఉద్యోగుల పాత్రపై ట్రెజరీ జిల్లా స్ధాయి అధికారి డీడీ భోగారావు శుక్రవారం విచారణ జరిపారు. స్థానిక సబ్ ట్రెజరీలోని ఖాతాలను, సబ్ ట్రెజరీ ద్వారా బ్యాంక్‌లో జరిగిన లావాదేవీలను లోతుగా పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్‌ను కలిసి ఖాతాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. సబ్ ట్రెజరీ నిధుల్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదని చెప్పారు. సబ్ ట్రెజరీ నిధులు, వోచర్లు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆయన వెంట సబ్ ట్రెజరీ అధికారులు జగదీశ్వరి, సోమయాజులు, జహిరుద్దీన్ తదితరులున్నారు.
ఎస్‌బీహెచ్‌లో రూ. 2.65 కోట్లు మాయం
Published Fri, Oct 14 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
Advertisement
Advertisement