ఫిట్ నెసెసరీ
ఫిట్ నెసెసరీ
Published Sat, Jun 10 2017 11:59 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
రేపటి నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు
పూర్తికాని బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలు
జిల్లాలో 2,900 స్కూల్ బస్సులు
ధ్రువీకరణ పత్రం పొందినవి 450 మాత్రమే
స్పీడ్ గవర్నెన్స్ తప్పని సరి
విముఖంగా ఉన్న యాజమాన్యాలు
సాక్షి, రాజమహేంద్రవరం : రెండు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలను చేర్పించుకునేందుకు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిన పాఠశాలల యాజమాన్యాలు సకాలంలో అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే పిల్లలను పత్రి రోజూ ఇంటి నుంచి స్కూల్‌కు, స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే బస్సులను నిబంధనల ప్రకారం సిద్ధం చేయడంలో ఆసక్తి చూపడంలేదు. బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్ గవర్నెన్స్ విధానాన్ని ఈ ఏడాది తప్పనిసరి చేయడంతో సమస్య తలెత్తుతోంది. గత ఏడాది నుంచి ఈ స్పీడ్ గవర్నెన్స్ విధానం అమలులో ఉంది. కానీ మార్కెట్‌లో పరికరాల లభ్యత, ఇతర కారణాల వల్ల అమలుపై ప్రభుత్వం పాఠశాలలపై పెద్దగా ఒత్తిడి చేయలేదు. కానీ ఈ ఏడాది సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో పాఠశాలల బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా రవాణా శాఖ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయా బస్సులకు స్పీడ్ గవరెన్స్ యంత్రం ఉంటేనే తనిఖీలు చేపడుతున్నారు.
20శాతం కూడా పూర్తి కాలేదు...
గత నెల 15వ తేదీ నుంచి రవాణా శాఖ అధికారులు బస్సులను తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలలో పాఠశాలలు, కళాశాలల బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 15 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా పాఠశాలలు ఈ నెల 6వ తేదీనే తెరిచాయి. జిల్లాలో విద్యార్థులను పాఠశాలలు, కాలే జీలకు తరలించే బస్సులు 2,900 ఉన్నాయి. ఇందులో గత బుధవారానికి 450 బస్సులకు మాత్రమే తనిఖీలు పూర్తి చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇక 15వ తేదీ లోపు మిగిలిన 2,450 బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలకు రావాల్సి ఉంది.
తికమకగా స్పీడ్ గవర్నెన్స్ యంత్రాలు..
నూతన విధానం కావడం, మార్కెట్లో పలు రకాల కంపెనీల స్పీడ్ గవర్నెన్స్ యంత్రాలు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. రూ.3వేల నుంచి రూ.8 వేల వరకు స్పీడ్‌గవర్నన్స్ యంత్రాలు లభ్యమవుతున్నాయి. యంత్రం బిగించి స్పీడు మీటరు 60 కిలోమీటర్లకు పరిమితం చేసినా పరీక్షలో కొన్నిసార్లు విఫలమవుతున్నాయి. రీడింగ్ పలుమార్లు పలు రకాలుగా చూపుతుండడంతో అధికారులు తిరస్కరిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ యంత్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపకపోవడమూ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీకి ప్రధాన కారణంగా ఉంది.
ఫిట్‌నెస్ లేకుంటే కేసు
ప్రతి పాఠశాల, కాలేజీ బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ యంత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పాఠశాలల యాజమాన్యాలు స్పీడ్‌గవర్నెన్స్ యంత్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. మేం మాత్రం యంత్రాలు ఏర్పాటు చేసుకుని వస్తేనే తనిఖీలకు అనుమతిస్తాం. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, నిబంధనలు పాటించని బస్సులను తిప్పితే చట్టప్రకారం చర్యలు తప్పవు.
– సిరి ఆనంద్, డీటీసీ, కాకినాడ
Advertisement