స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ లేకుంటే చర్యలు
అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి
రాజమహేంద్రవరం క్రైం : స్కూల్, కళాశాల బస్సులు ఫిట్‌నెస్ లేకుంటే ఆ యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి హెచ్చరించారు. ఎస్‌కేవీటీ కళాశాలలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్‌నెస్‌ను, నిర్వహణను శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో 719 బస్సులకు 574కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. మే 15వ తేదీకి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల గడువు తేదీ ముగుస్తుందని రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రోడ్డు రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఐదు టీమ్‌లు ఏర్పాటు చేశామని ఇవి హైవేపై పెట్రోలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తాయన్నారు.
డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
స్కూల్, కాలేజీ బస్సుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, క్లినర్ లేకుండా బస్సులు తీయవద్దన్నారు. విద్యార్థులు బస్సులో నుంచి చేతులు బయట పెట్టకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నోడల్ ఆఫీసర్ భరత్ మాతాజీ, సెంట్రల్ డీఎస్పీ జె.కులశేఖర్, ఎస్‌బీ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐలు చింతా సూరిబాబు, బాజీలాల్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, త్రీటౌన్ సీఐ మారుతీ రావు, ఎస్సై రాజశేఖర్, రోడ్ రవాణా శాఖల అధికారులు సాయినాథ్, పరందామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.