
పాఠశాలలపై పట్టింపేదీ?
♦ విద్యాశాఖ అలసత్వం
♦ టీచర్లు లేక మూతపడుతున్న స్కూళ్లు
♦ ప్రభుత్వ బడులపై విద్యాశాఖ అలసత్వం
♦ టీచర్లు లేక మూతపడుతున్న స్కూళ్లు
♦ కొన్నిచోట్ల విద్యావలంటీర్లతో సరి
సర్కార్ బడుల్లో కార్పొరేట్ వసుతులు.. ఇంగ్లిష్ చదువులు.. అంటూ బడిబాట కార్యక్రమంలో ప్రచారార్భాటం చేసిన విద్యాశాఖకు క్షేత్రస్థాయిలో సమస్యలు కనిపించడం లేదు. వసతుల మాట దేవుడెరుగు.. అసలు ఉపాధ్యాయులే లేని విద్యాలయాలు ఉన్నయాంటే జిల్లా యంత్రాంగం ఏ స్థాయిలో ‘చదువు’లకు స్థానం కల్పించిందో అర్థం చేసుకోవచ్చు.
మెదక్: జిల్లావ్యాప్తంగా 2,831 పాఠశాలలు ఉండగా వాటిలో ప్రాథమిక 1907, ప్రాథమికోన్నత 416, ఉన్నత పాఠశాలలు 508 ఉన్నాయి. ఇందులో 321 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయులు లేరు. విద్యావలంటీర్లు(వీవీ)లతో ఆయా పాఠశాలలు నడుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలోని 16 పాఠశాలల్లో కనీసం వీవీలు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై కొనసాగిస్తున్నట్టు సమాచారం. 531 బడుల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉండటం గమనార్హం.
వారానికి రెండు, మూడుసార్లు స్కూల్‌కాంప్లెక్స్ మీటింగ్‌లు, ఎంఈఓ సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండటంతో కొన్నిచోట్ల ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు సైతం వెళ్లిపోతుండటంతో పాఠశాలలకు తాళాలు పడుతున్నాయి. ఒక్క మెదక్ మండలంలో పొచమ్మరాల్ తండా, అజాంపురా, పిట్లంబేస్, గోల్కొండలోని అంబేద్కర్‌కాలనీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. వీవీలతోనే కొనసాగుతున్నాయి. పిట్లంబేస్ చెరువు కట్టకింది పాఠశాల టీచర్లు లేక మూతపడింది. అదేవిధంగా పట్టణంలోని గోల్కొండ వీధి అంబేద్కర్ కాలనీ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండగా 95 మంది చదువుతున్నారు. అందులో ఒకే ఒక్క వీవీ.. విద్యార్థులందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిస్తున్నాడు. దీంతో ఏ తరగతికి ఏ పాఠం చెబుతున్నాడో అర్థంకాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
అక్కరకురాని డీఎస్సీ
సర్కార్ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించడం లేదు. ‘సర్కారు బడుల్లోనే చక్కనైన విద్య’ అంటూ ప్రచారాలకే పరిమితమవుతూ.. క్షేత్రస్థాయి ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఉపాధ్యాయులే లేకుండా నాణ్యమైన బోధన ఎలా సాధ్యమవుతుందంటూ పేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు.