కల్లూరులో పర్యావరణ రైలు
నేడు చివరి ప్రదర్శన
పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు వివిధ ప్రదర్శనలతో కూడిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైలు శనివారం నుంచి కల్లూరు రైల్వేస్టేషన్‌లో విడిది చేసి ఉంది. ప్రతి రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ రైలులో సందర్శకులను అనుమతిస్తున్నారు. శని, ఆదివారాల్లో దాదాపు 14 వేల మంది విద్యార్థులు ఈ రైలును సందర్శించారు. సోమవారం (నేడు) ఈ రైలు సందర్శనకు చివరి రోజు.
సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ రైలు కల్లూరులోనే ఉంటుంది. మంగళవారం బెంగళూరు మీదుగా తమిళనాడులో ప్రవేశించనుంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, భూ ఉపరితలంపై వాటి దుష్ర్పభావం, పర్యావరణ పరిరక్షణ.. తదితర అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఇక్కడి గైడ్‌లు వివరిస్తున్నారు. సైన్స్‌పై విస్తృతంగా అవగాహన పెంచే ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలును చూసొద్దాం రండి..
- గార్లదిన్నె (శింగనమల)
సైన్స్‌పై ఆసక్తి పెరిగింది
సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎన్నో అంశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఈ రైలును సందర్శించిన తర్వాత నాకు సైన్స్‌పై ఆసక్తి పెరిగింది. పుస్తకాల్లో ఉన్న సమచారాన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన రైలు ఇది.
– నుష్రత్, పదో తరగతి, ఇల్లూరు, గార్లదిన్నె మండలం
విజ్ఙాన ప్రపంచం
ఈ రైలును చూసిన వచ్చిన తర్వాత విజ్ఞాన ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లైంది. రైలంతా విజ్ఞాన, రంగుల ప్రపంచం. విశ్వం.. అందులోని అంశాలు పూర్తిగా తెలుసుకున్నాను. మాటల్లో చెప్పలేను గాని ఈ రైలును చూసి తీరాల్సిందే.
– ప్రత్యూష, ఆరో తరగతి, ఎగువపల్లి, గార్లదిన్నె మండలం
అవగాహన పెరిగింది
ఎన్నో పుస్తకాలు చదువుకున్నాను. సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలులోని చాలా అంశాలను కళ్లతో చూసిన తర్వాత పుస్తకాల్లో చదువుకున్న అంశాలు బాగా అర్థమయ్యాయి. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
– జిలాన్ బాషా, ఇంటర్, కల్లూరు, గార్లదిన్నె మండలం
పర్యావరణంపై అవగాహన పెంచేందుకు
పర్యావరణంలో వచ్చే మార్పులు, పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత వంటి అంశాలపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు అవగాహన పెంచేందుకు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎంతో దోహద పడుతోంది.
- విశ్వేశ్వరయ్య, రైల్వే స్టేషన్ మాస్టర్, కల్లూరు ఆర్‌ఎస్