రెండో పెళ్లి వరుడి వయసు ఎక్కువని...
తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
కొండపాక: అదృశ్యమైన యువతిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించామని కుకునూర్‌పల్లి ఎస్సై రామక్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన పోలీస్టేషన్‌లో మాట్లాడుతూ కొండపాక మధిర దమ్మక్కపల్లికి చెందిన దర్పల్లి సువర్ణ, కనకయ్యల కూతురు కృష్ణవేణి(21)కి ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. కాగా గొడవల కారణంగా క్రిష్ణవేణి భర్తతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు కోర్టులో కొనసాగుతోంది. కృష్ణవేణి తల్లిదండ్రుల వద్దే ఉంటూ కొన్నాళ్లుగా టైలరింగ్ పని చేస్తోంది. ఈ క్రమంలో ఎలాగూ కూతురికి భర్తతో విడాకులు అవుతాయని భావించిన తల్లిదండ్రులు ఆమెకు రెండో పెళ్లి చేసేందుకు నిర్ణయించి పెళ్ళి సంబంధం ఖాయం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
కాగా కృష్ణవేణికి రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి వయస్సులో సగానికి పైగా తేడా ఉంది. దీంతో పెళ్లి ఇష్టం లేక కృష్ణవేణి ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు కృష్ణవేణిని శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ ప్రైవేటు దుకాణంలో టైలరింగ్ పని చేస్తుండగా పట్టుకున్నారు. ఈవిషయమై కృష్ణవేణికి, తల్లిదండ్రులకు పోలీస్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ముత్యం, కానిస్టేబుల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.