సాక్షి, అమరావతి : తెలుగు లోగిళ్లలో వివాహమంటే ఓ సుదీర్ఘ ప్రక్రియ. సరైన జోడీని వెతకడం కోసం పెళ్లిళ్ల పేరయ్యల వెంట తిరగడం, తెలిసిన వారికి బాధ్యతలు అప్పగించడం, అమ్మాయి, అబ్బాయిల గుణగణాలు వాకబు చేయడం.. ఇలా ఓ పెద్ద తంతే నడుస్తుంది. అదే రెండో వివాహమైతే చెప్పనలవికాదు. అయితే ప్రస్తుతం వివాహ వ్యవస్థలో నయా ట్రెండు మొదలైంది. వివాహాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో అంతకంటే మించి పరిణయ వేదికలుగా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు పరిఢవిల్లుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండో పెళ్లి జరగడం చాలా సులభంగా మారింది. అబ్బాయిని, అమ్మాయిని కలపడానికి కుప్పలు తెప్పలుగా సెకండ్ షాదీ వెబ్‌సైట్‌లు వెలిశాయి. పెళ్లిళ్ల పేరయ్యలను సంప్రదించాల్సిన పనిలేకుండా పోయింది. వెబ్‌సైట్‌లలోకి వెళితే చాలు మీకు నచ్చిన, మీరు మెచ్చిన వధువును, వరుడిని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఒక్కసారి విడాకులు పొందిన వారికి మళ్లీ పెళ్లి కావడం కొన్నేళ్ల కిందట వరకూ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మొహమాటాలకు తావివ్వకుండా రెండో పెళ్లి చేసుకునే యువతీ యువకులు బాగా పెరిగారు. ఇప్పటివరకూ ఉత్తరాదికే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా పెరిగినట్టు షాదీ డాట్‌కామ్‌లు వెల్లడిస్తున్నాయి.
ఏడాదిలో 80 వేల మంది నమోదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే ఇలా ఆన్‌లైన్ షాదీ డాట్‌కామ్‌లలో రెండో పెళ్లికి పేరు నమోదు చేసుకున్న వారు 80వేల మందిపైనే ఉన్నారు. వీళ్లందరూ వివిధ కారణాల వల్ల విడాకులు పొందడం, లేదా ఏదైనా ప్రమాదవశాత్తు భర్త లేదా భార్యను కోల్పోయి రెండో పెళ్లికి దరఖాస్తు చేసుకున్నవారే. ఎత్తు, వయస్సు, చదువు, గోత్రంతో సహా వివరాల్లో వెల్లడిస్తున్నారు. వెబ్‌సైట్‌లో చూసిన వారు నచ్చితే ఆన్‌లైన్ ద్వారానే సమ్మతి తెలియజేయచ్చు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగిపోతుంటాయి. రెండోసారి తమకు నచ్చిన విధంగా వధూవరులుగా మారిపోవచ్చు. రెండో పెళ్లి కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో అమ్మాయిల సంఖ్య పెరుగుతుండటం ఒక ఆసక్తికర పరిణామం.
నడతలో మార్పుల వల్లే విడాకుల కేసులు
పటిష్టమైన, సంప్రదాయమైన వివాహ వ్యవస్థ ఉన్న భారతదేశంలో పదేళ్ల కిందట విడాకుల సంఖ్య మొత్తం వివాహాల్లో ఒక శాతం మాత్రమే. అదే అమెరికా లాంటి పాశ్చాత్యదేశాల్లో అక్షరాలా 54 శాతం. తాజాగా భారతదేశంలో విడాకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తేలింది. తాజా లెక్కల ప్రకారం(2011 గణాంకాల ప్రకారం) విడాకులు పొందుతున్న వారి సంఖ్య నాలుగు శాతానికి పెరిగింది. మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరగడం, ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరిగిపోవడం, సర్దుకుపోయే తత్వం సన్నగిల్లడం, అభిప్రాయ భేదాలు పెరగడం, తన మాటే నెగ్గాలని ఎవరికి వారు భావిస్తుండటం, పెళ్లి అయ్యాక కూడా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటుండం.. తదితర కారణాల వల్ల విడాకుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉండాలన్న అభిప్రాయం 90 శాతం మందిలో లేదని వారు చెబుతున్నారు. ఆడవారు గానీ మగవాళ్లు గానీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా తిరిగి తమకు నచ్చిన వారితో వివాహం చేసుకునేందుకు వెంటనే సిద్ధపడుతున్నారు. 2001 లెక్కల ప్రకారం 20.34 లక్షల మంది విడాకులు తీసుకున్నట్టు ప్రభుత్వ గణాంకాల్లో నమోదైంది.
- భారతదేశంలో పదేళ్ల కిందట విడాకుల సంఖ్య మొత్తం వివాహాల్లో ఒక శాతం మాత్రమే. అదే అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో అక్షరాలా 54 శాతం
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే ఇలా ఆన్‌లైన్ షాదీ డాట్ కామ్‌లలో రెండో పెళ్లికి పేరు నమోదు చేసుకున్న వారు 80వేల మందిపైనే
- రెండో పెళ్లి కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది.
- విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉండాలన్న అభిప్రాయంలేని వారు 90 శాతం
- 2001 లెక్కల ప్రకారం 20.34 లక్షల మంది విడాకులు తీసుకున్నట్టు ప్రభుత్వ గణాంకాల్లో నమోదైంది
- రెండోసారి వివాహాలకు మేమున్నామంటు వెలిసిన ఆన్‌లైన్ షాదీ డాట్ కామ్‌లు
- www.bandhan.com
- www.secondshaadi.com
- www.thesecondmarriage.com
- www.remarriage.com
- www.jeevansaathi.com
- www.mysecondmarriage.com
- www.simplymarry.com
- www.familyshaadi.com
- www.lovevivah.com
- www.assistedmatrimony.com
Comments
Please login to add a commentAdd a comment