ఢిల్లీలో ప్రదర్శనకు ‘సీతాకోక చిలుక’
నూనెపల్లె: దేశ రాజధాని ఢిల్లీలో శ్రీకృష్ణ తెలుగు థియేటర్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించే నాటక ప్రదర్శనకు సీతాకోక చిలుక నాటకం ఎంపికైనట్లు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ తెలిపారు. స్థానిక కళారాధన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 24, 25వ తేదీల్లో ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివద్ధి సంస్థ సహకారంతో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో నంద్యాల కళారాధన–గురురాజ కాన్సెప్ట్ స్కూల్ సంయుక్త నిర్వహణలో రూపొందించి బంగారు నంది అవార్డు పొందిన సీతాకోక చిలుక బాలల సాంఘిక నాటిక ప్రదర్శనకు ఆహ్వానం లభించిందన్నారు. ఢిల్లీలో నిర్వహించే ఇలాంటి ప్రదర్శనకు ఆహ్వానం రావడం గర్వకారణమన్నారు. గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరిరెడ్డి, డైరెక్టర్ మౌలాలిరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల నాటకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భవనాశి నాగమహేష్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.