సీతారాముల కల్యాణము చూతము రారండి | Seetharamula kalyanam | Sakshi
Sakshi News home page

సీతారాముల కల్యాణము చూతము రారండి

Published Fri, Apr 15 2016 4:25 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

సీతారాముల కల్యాణము చూతము రారండి - Sakshi

సీతారాముల కల్యాణము చూతము రారండి

♦ నేడు భద్రాద్రిలో జరిగే రాములోరి పెళ్లికి ఏర్పాట్లు పూర్తి
♦ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానున్న సీఎం కేసీఆర్
♦ రేపు పట్టాభిషేకానికి హాజరు కానున్న గవర్నర్ నరసింహన్
 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: 
దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గం టల వరకూ స్వామి వారి కల్యాణ వేడుక అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంట లకు అభిజిత్ లగ్నమున సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. జగత్ కల్యాణ శుభ సన్నివేశమైన ఈ మహాఘట్టాన్ని చూసి తరించేందుకని వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం ఇప్పటికే భద్రగిరి చేరుకున్నారు.

మిథిలా స్టేడియం ప్రాంగణంలో 35 వేల మంది కూర్చొని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణం తిలకి ంచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో వేచిఉండే భక్తుల కోసమని స్వామివారి కల్యాణం వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తానీషా గోల్కొండ న వాబుగా ఉన్న కాలంలో భద్రాచలం తహసీల్దార్‌గా ఉన్న రామదాసు ప్రజల నుంచి వసూలు చేసిన  కప్పం సొమ్ము రూ.6 లక్షల మొహరీలను గోల్కొండ నవాబుకు చెల్లించకుండా ఆ సొమ్ముతో భద్రాద్రి దేవాలయాన్ని కట్టించారు.

ఇందుకు ఆగ్రహిం చిన తానీషా, రామదాసును  గోల్కొండలో 12 ఏళ్లపాటు కారాగారంలో బంధించారు. రామదాసు శ్రీరామచంద్రుడిని, సీతమ్మను వేడుకోవడంతో శ్రీరాముడే ఆ అప్పును చెల్లించాడు. మారువేషంలో తన వద్దకు వచ్చి రూ.6 లక్షల మొహరీలు చెల్లించింది రామ, లక్ష్మణులు అని  తెలుసుకున్న తానీషా రామభక్తునిగా మారతాడు. అప్పటి 6 లక్షల బంగారు నాణేలలో రెండు బంగారు నాణేలు రామాలయంలో నేటికీ భద్రపరచబడి ఉన్నాయి. చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న ఈ నమూనాలతో భక్తుల కోసం వెండి, రాగి నాణేలుగా విక్రయిస్తుంటారు. శ్రీ రాముడి భక్తుడిగా మారిన తానీషా ఆయన  కల్యాణానికి  తలంబ్రాలు పంపారు. ఆనాటి సంప్రదాయం ప్రకారం నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి  రాష్ట్ర  ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపిస్తారు.

పావన గౌతమీనదీ తీరాన ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతూ కలియుగ వైకుంఠాన్ని మరిపిస్తున్న భద్రాచలం పుణ్యక్షేత్రం పేరు వినగానే భక్తులకు భద్రా ద్రి సీతారామలక్ష్మణులతోపాటు రామాయణ ఘట్టాలు, శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు గుర్తుకొస్తాయి. ఈ క్షేత్రంలో ప్రతీ ఏటా చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రం లో అభిజిత్  లగ్నమున శ్రీపాంచరాత్రాగమ శాస్త్రో క్త విధానంగా శ్రీసీతారామచంద్రుల తిరుకల్యాణ  మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. శిల్పకళా శోభితమై అలరారే కల్యాణమండపంలో జరిగే జగదభి రాముడి కల్యాణాన్ని కనులారా తిలకిం చి తరించేందుకు భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.

 ముస్తాబైన భద్రాద్రి  
 శ్రీసీతారాముల  కల్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. కల్యాణం జరిగే మిథిలా స్టేడియం ప్రాంతమంతా చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాల అలంకరణతో శోభాయమానంగా మారింది. కల్యాణ మండపాన్ని రమణీయంగా తీర్చిదిద్దా రు. మండప ఆవరణ మొత్తం సెక్టార్లుగా విభజించి భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించేందుకుగాను ఏర్పాట్లు పూర్తిచేశారు.

 నేడు సీఎం కేసీఆర్, రేపు గవర్నర్ రాక  
 భద్రాచలంలో శుక్రవారం జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి  సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రా లు తీసుకొస్తున్నారు. అదే విధంగా శనివారం జరి గే పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వ అతిథిగా గవర్నర్ నరసింహన్ రానున్నారు. దీంతో జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.   
 
 వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం
 భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఎదుర్కోలు ఉత్సవం గురువారంరాత్రి   వైభవోపేతంగా జరిగింది. శ్రీసీతారాముల పెళ్లి సందర్భంగా వారివారి వం శాల గొప్పతనాన్ని గురించి చెప్పుకునే ఈ వేడుక భక్తులను ఆద్యంతం కనువిందు చేసింది. మా వంశం గొప్పదంటే ... కాదు మా వంశమే గొప్పదని చెబుతూ కొంతమంది అర్చకులు సీతమ్మ వారివైపు, మరికొంతమంది  రామయ్య వారివైపు చేరి ఈ వేడుకను నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి ైవె భవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారని స్థానాచార్యులు కేఈ స్థలసాయి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement