ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు..
* అతని మనోధైర్యం ముందు అంగవైకల్యం దిగదిడుపు
* ప్రదర్శనలతో రాణిస్తూ జీవనం సాగిస్తున్న నూర్
గుంటూరు (ఆనందపేట): ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. నమ్ముకున్న కళలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు నూర్ అలీఖాన్. ఆనందపేట, ఐదవ లైనుకు చెందిన మహమ్మద్ నూర్ అలీఖాన్ ఐదు నెలల వయసులో ఉండగా పోలియో సోకి అంగవైకల్యం బారిన పడ్డాడు. కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. అయినా నూర్ ఆలీఖాన్ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. నూర్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలు, నటన, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. అందుకే వాటిలో రాణించేదుకు కృషి చేశాడు. టీవీల ముందు కూర్చుని తనకు ఇష్టమైన పాటలను చూస్తూ సాధన చేశాడు. ఆరేళ్లుగా వందల సంఖ్యలో స్టేజీలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రతిభ కనబరుస్తున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనలతో పలువురి ప్రశంసలు, సన్మానాలు పొందుతూ ముందుకు సాగుతున్నాడు. రెండేళ్ల క్రితం మదర్ ధెరిస్సా వికలాంగుల ఆర్కెస్ట్రా పేరుతో సొంత ఆర్కెస్ట్రా ప్రారంభించి ప్రదర్శనలు ఇస్తున్నాడు. డ్యాన్స్‌లతో పాటు పాటలు పాడడం, మిమిక్రీ కళతో అలరిస్తున్నాడు. ఇప్పటివరకు గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరిపేటలలో ప్రదర్శనలు ఇచ్చి పలువురి మన్ననలు పొందాడు.
కుటుంబ నేపథ్యం....
ఆర్‌ఎంపీ వైద్యుడైన ఇనాయత్, నిలోఫర్ దంపతులకు ముగ్గురు మగ సంతానం. వారిలో నూర్ అలీఖాన్ పెద్దవాడు. పదేళ్లక్రితం షహిన్‌తో వివాహం జరిగింది. ఇటీవలే వారికి బాబు జన్మించాడు. ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
మంచి పేరు తెచ్చుకోవాలి...
– మహమ్మద్ నూర్ అలీఖాన్
మంచి పేరు తెచ్చుకోవాలి...నలుగురికీ సహయ పడాలి. ఆదాయం కొంత ఎక్కువగా వచ్చినపుడు రోడ్లపై పడుకునే అనాథలకు ఆహారం పొట్లాలు అందిస్తాను. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టడమే నా లక్ష్యం.