మరికల్‌లోని ఓ దుకాణంలో అక్రమ ఎరువులను పట్టుకున్న అధికారులు(ఫైల్)
-పాత ధరలకే ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులు
∙-రైతులకు నాసిరకపు మిశ్రమ ఎరువుల అమ్మకం
- ఇటీవల మరికల్‌లో అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..
-డీసీఎంఎస్‌లోనూ అధికధరలకు విక్రయిస్తున్న వైనం
- 2610గాను 80శాంపిళ్ల ఎరువులు మాత్రమే సేకరణ
-పంట దిగుబడి రాక ఏటా నష్టపోతున్న రైతన్నలు
మహబూబ్‌నగర్ వ్యవసాయం:ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినా.. జిల్లాలో కొందరు వ్యాపారులు మాత్రం పాతరేట్లకే విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్నారు. దీంతోపాటు అనుమతి లేని మిశ్రమ ఎరువులను అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఇటీవల వ్యవసాయశాఖ అధికారులకు సూచించినా చర్యలు తీసుకోలేదు. ఖరీఫ్‌లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో రైతులు పంటలసాగుపై మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులు, వ్యాపారులు కలిసి ప్రభుత్వ అనుమతులు లేని నాసిరకం ఎరువులను రైతులకు అంటగట్టేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో వారంరోజుల క్రితం జిల్లా వ్యవసాయశాఖ డీడీఏ(పీపీ) సింగారెడ్డి ధన్వాడ మండలంలోని మరికల్‌లో అనుమతులు లేని 3.3టన్నుల ఎరువులను డీలర్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో నాసిరకం ఎరువులను విక్రయిస్తున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. పొరుగురాష్ట్రాలు ఏపీ, కర్ణాటక నుంచి రాత్రివేళల్లో గట్టుచప్పుడు కాకుండా డీలర్లకు చేరవేస్తున్నారు. దీంతో అధిక మార్జిన్‌కు ఆశపడిన కొందరు వ్యాపారులు రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా గద్వాల, ఆత్మకూర్, కొత్తకోట, వడ్డేపల్లి, ధరూర్, నారాయణపేట, మల్దకల్, గట్టు, అయిజ, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి, ఎర్రవల్లి, పెబ్బేరు, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ తదితర మండలాల్లో నాసిరకం ఎరువులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. వీటిని కొనుగోలుచేసిన రైతులు పంట దిగుబడి రాక మరింత నష్టపోతున్నారు.
పాతధరలకే విక్రయం
రైతులను ఆదుకోవాలని కేంద్రప్రభుత్వం గతనెల 16న ఎరువుల ధరలు తగ్గించింది. ఈ రేట్లు అదేరోజు నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో డీఏపీ బస్తాపై ప్రభుత్వం కంపెనీ బట్టి రూ.120 నుంచి రూ.170 వరకు తగ్గించింది. అలాగే మ్యురేట్ ఆఫ్ పోటాష్ ధరలను రూ.250 నుంచి రూ.263కు తగ్గించింది. అయితే ఈ ధరలు జిల్లాలో ఎక్కడా అమలుకావడం లేదు. దీంతో రైతులు ఎరువుల భారం మోయలేక లబోదిబోమంటున్నారు. పాతరేటు కంటే ఎక్కువ ధరలకు డీఏపీ, మిశ్రమ ఎరువులను అంటగడుతున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా స్థానిక నాయకుల రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో అధికధరలు
జిల్లాలోని మారుమూల గ్రామాలు, మండలాల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయించడం సర్వసాధారణమే. జిల్లా కేంద్రంలోనూ ఇవే ధరలకు విక్రయిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ రంగసంస్థ డీసీఎంఎస్‌లో రూ.1155కు విక్రయించాల్సిన డీఏపీని బస్తాను రూ.1210కు విక్రయిస్తూ రైతులపై భారం మోపుతున్నారు. ఈ సంస్థ నోటిస్ బోర్డుపైనే డీఏపీ బస్తాకు రూ.1210కు అమ్ముతున్నట్లు రాసి బహిరంగ దోపిడీకి పాల్పడుతోంది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని చాలా దుకాణాల్లో ఇవే ధరలు అమలవుతున్నాయి.