
బాలికపై లైంగిక దాడి ..వీడియో చిత్రీకరణ
తూర్పు గోదావరి జిల్లా : తన చెల్లెలి కోసం వచ్చిన ఆమె స్నేహితురాలిపై ఓ యువకుడు లైంగిక దాడి చేసిన సంఘటన ఆలమూరు మండలం జొన్నాడలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఎస్సీ పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక గత నెల 9న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అప్పటికే ఇంటిలో ఉన్న స్నేహితురాలి సోదరుడు తాడేపల్లి వరప్రసాద్ (19)ను ‘మీ చెల్లెలు ఎక్కడుంది’ అని అడగగా గదిలో ఉందని చెప్పాడు.
బాలిక ఆ గదిలోకి వెళ్లగానే తలుపులు గడియ పెట్టి కత్తితో బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించానని, విషయం బయటకు చెపితే అందరికీ వెల్లడించి పరువు తీస్తానని బెదిరించాడు. అంతేకాక బాలిక కుటుంబ సభ్యులను సైతం చంపుతానని హెచ్చరించాడు. దాంతో ఆ బాలిక జరిగిన ఘాతుకం గురించి ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయింది. కాగా శుక్రవారం వరప్రసాద్ స్నేహితుల మొబైల్ ఫోన్లలో లైంగికదాడికి సంబంధించిన దృశ్యాలు స్థానికుల కంటబడ్డాయి.
విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కుమార్తెను నిలదీయగా విలపిస్తూ జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ ఆదేశాల మేరకు మండపేట సీఐ వి.పుల్లారావు, ఆలమూరు ఎస్సై ఎం.శేఖర్‌బాబు బాధితురాలి నివాసానికి వెళ్లి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. నిందితుడు వరప్రసాద్ పరారీలో ఉన్నాడు.