మానసిక పరిణతి లేని కూతురిని కంటికి రెప్పలా చూసుకోవలసిన తండ్రే ఆమెపై లైంగికదాడికి పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అంబాజీపేటలోని నెల్లివారిపేటకు చెందిన చింతపల్లి వెంకటేశ్వరరావు (శ్రీను) వడ్రంగి పని చేసుకుని జీవిస్తున్నాడు. అతడి భార్య ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె (17) మానసిక పరిణతి లేదు.
తొమ్మిదో తరగతి వరకూ చదివిన ఆ బాలిక రెండేళ్లుగా తన పెద్దమ్మ ఇంటివద్దనే ఉండేది. ఆరు నెలల క్రితం తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. రోజూ తాగి వచ్చే శ్రీను కూతురితో అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఆమె కేకలు వేసేదని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
పరీక్షించిన వైద్యులు బాలిక మూడో నెల గర్భిణి అని ధ్రువీకరించారు. దీంతో స్థానికులు బాలికను నిలదీసి అడిగారు. ఆమె తన తండ్రి ప్రవర్తన గురించి వివరించడంతో అతడి అకృత్యం వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.