కీచక గురువుకు దేహశుద్ధి
చిట్టమూరు: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు విద్యార్థినుల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తుండడంతో గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేసి పాఠశాలకు తాళం వేసిన సంఘటన నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఆరూరులో శుక్రవారం జరిగింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి విధులకు హాజరవుతూ.. ఐదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పక్కనే ఉన్న మరో గదిని శుభ్రం చేయాలన్న నెపంతో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు కన్నీటి పర్యంతమయ్యారు.
కొద్ది రోజులుగా ఈ తంతు జరుగుతుండగా భయపడిన విద్యార్థినులు శుక్రవారం పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు మూకుమ్మడిగా పాఠశాలకు వెళ్లేసరికి ఉపాధ్యాయుడు పూటుగా మద్యం సేవించి ఉన్నాడు. అక్కడి పరిస్థితిని గమనించిన వారు ఆగ్రహావేశాలతో ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం ఎంపీపీ జనార్దన్, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, ఎస్సై గోపాల్‌లకు సమాచారమందించారు. పోలీసులు శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసులుపై తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అతడిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎంపీపీ సూచించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ చెప్పారు. ఈ ఉపాధ్యాయుడు తమకొద్దు అంటూ తల్లిదండ్రులు నినదించారు.