
చావు రాజకీయాలు చేస్తున్నారు
► టీడీపీ నాయకులపై శిల్పా మోహన్‌రెడ్డి ధ్వజం
► వైఎస్ జగన్ రోడ్‌షోలో ప్రసంగం
సాక్షి బృందం నంద్యాల: టీడీపీ నాయకులు చావు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల సాయిబాబానగర్‌లో శుక్రవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో శిల్పా ప్రసంగించారు. ‘ఈ నెల 23న ఉప ఎన్నికల పోలింగ్ ఉంది. గత ఎన్నికల్లో వారం పాటు సిటీ కేబుల్‌లో శోభానాగిరెడ్డి మరణానికి సంబంధించిన ఘటనలు చూపించారు. ఈ కారణంగా అప్పటి ఎన్నికల్లో ఓడిపోయినా, తిరిగి అదే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా చనిపోయిన భూమానాగిరెడ్డి, శోభానా గిరెడ్డిని టీవీల్లో చూపుతూ చావు రాజకీయాలతో మీ ముందుకు వస్తున్నారు. ఈ సమయంలోనే అక్కా చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్లు విజ్ఞత ప్రదర్శించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.
2019లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడానికి æ నంద్యాల ఎన్నికలే నాంది కావాలి’ అని పిలుపునిచ్చారు. ‘వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సభలు, రోడ్‌షోలకు మహిళలను రానివ్వకుండా రూ.300 నుం చి రూ.500 వరకు డబ్బు చెల్లించి అడ్డుకుంటున్నారు. సభలు జయప్రదం కాకూడదని ఇలా చేస్తున్నారు. అయినా లెక్క చేయకుండా జగన్‌మోహన్‌రెడ్డిపై, నాపై అభిమానంతో ఎంతో మంది తరలివచ్చారు. వైఎస్సార్‌సీపీ బలాన్ని ఎదుర్కోలేక టీడీపీ కుల , మత రాజకీయాల చేస్తోంది. నా పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరినీ ఒక్క మాట కూడా అనకున్నా ఏవేవో అన్నట్లు చిత్రీకరిస్తున్నారు’ అని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు
. ‘20ఏళ్లుగా పేదల సంక్షేమం కోసం శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో పైసా తీసుకోకుండా గ్రామాలు, పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నాం. వడ్డీలేకుండా, పావలా వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. సూపర్ మార్కెట్‌లో సరుకులు అందిస్తున్నాం. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలకు సేవ చేస్తున్నాం. వ్యాపారంగానీ, బ్రాందీషాపులు కాని, పర్సెంటేజీలు గాని తీసుకోలేదు. ప్రస్తుతం టీడీపీ నాయకులు డబ్బుతో పలువురిని కొనుగోలు చేస్తున్నారు. పోలీసులతో బెదిరిస్తున్నారు. ఓటు వేయకపోతే రేషన్‌కార్డులు, పింఛన్లు పోతాయంటూ జనాన్ని బెదిరిస్తున్నారు. ఒక్కసారి రేషన్‌కార్డు, పింఛన్ వస్తే ఆ వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. వాటి ఆధారంగా కోర్టుకు వెళ్లయినా సరే తిరిగి సాధిస్తాం. ఎవరికీ భయపడకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి’ అని శిల్పా మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జగన్ చలువతోనే మంత్రి పదవి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలువతోనే వైఎస్సార్ హయాంలో మంత్రి పదవి పొందినట్లు శిల్పా మోహన్‌రెడ్డి తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే దేవనగర్ క్రాస్‌రోడ్, వెంకటేశ్వర స్టోర్, పార్కురోడ్ సెంటర్, నాగులకట్ట తదితర కాలనీలను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. ఈ కాలనీల వాసులు 2004లో మోకాళ్లలోతు గుంతలతో విద్యుత్ లేక పూరిగుడిసెల్లో నివశించేవారన్నారు. దీంతో వాటి అభివృద్ధికి హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట మేరకు నెరవేర్చానని చెప్పారు.
పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి లాంటి నాయకులను గెలిపించిన ఘనత నంద్యాల ఓటర్లదని, మరోమారు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తన సోదరుడు చక్రపాణిరెడ్డి వంద రోజులు కూడా ఎమ్మెల్సీ పదవి అనుభవించకుండా రాజీనామా చేసి జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారని, దమ్ముంటే వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఇదే తరహాలో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబుకు సవాలు విసిరారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతి జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని, ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు