అంచనాకు అందని 'శివటెక్ ' నష్టం
– పోలీసుల అదుపులో మేనేజర్
– నేడు ఎండీ, ఈడీ రాక
కర్నూలు(అర్బన్): శ్రీ రాయలసీమ ఆల్కాలీస్ అండ్ అల్లాయిడ్ కెమికల్స్ కంపెనీకి సమీపంలోని శివటెక్ పరిశ్రమలో ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనే విషయంలో సంబంధిత అధికారులు ఒక అంచనాకు రాలేక పోతున్నారు. పరిశ్రమ ఎండీ శివకుమార్, ఈడీ అమిత్‌కుమార్ ఢిల్లీలో ఉండటం, ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో ఆర్థికంగా జరిగిన నష్టంపై కనీసం ప్రాథమిక అంచనాకు కూడా రాలేకపోతున్నారు. పరిశ్రమ మేనేజర్ నగరంలోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారు. యజమానుల ప్రమేయం లేనిదే ఆయన కూడా నోరు మెదపలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. జరిగిన అగ్ని ప్రమాదంలో 22 ట్యాంకర్లలో నిల్వ ఉన్న 950 మెట్రిక్ టన్నుల హైడ్రో క్లోరైడ్ ఆయిల్‌కు సంబంధించిన మెటీరియల్ కాలిపోయింది. దీనికి క్లోరిన్ కలిపి చేసి క్లోరినేటెడ్ ప్లోరాపిన్ వ్యాక్స్ తయారు చేస్తారు. అలాగే బై ప్రాడక్ట్‌గా హైడ్రో క్లోరైడ్ యాసిడ్‌ను కూడా తయారు చేస్తున్నట్లు సమాచారం. చిక్కగా ఉన్న ద్రవ పదార్థం కావడంతో మంటలతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయని, వీటిని 9వ తేదిన ఉదయం 6 గంటల వరకు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఫైర్ ఇంజన్లతో పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకువచ్చామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి భూపాల్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమకు సంబంధించిన ఎండీ, ఈడీ 10వ తేదిన వస్తున్నారని, వారితో మాట్లాడిన తరువాత నష్టంపై అంచనాకు వస్తామన్నారు.