
ఉద్యోగులకు షాక్!
బాబు చేసిన దీపావళి గాయం
♦ పండుగ రోజు పిడుగు.. గ్రాట్యుటీ రూ.10 లక్షలకే పరిమితం
♦ పీఆర్సీ రూ.12 లక్షలకు సిఫార్సు చేసినా పట్టించుకోని ప్రభుత్వం
♦ గత కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం
♦ ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన రాష్ర్టప్రభుత్వం
♦ త్వరలో ఉత్తర్వులు వస్తాయని వెల్లడించిన యనమల
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పిడుగులాంటి వార్త. దీపావళి పర్వదినం ముందు వారికి ఊహించని షాక్. పీఆర్సీ సిఫార్సు మేరకైనా గ్రాట్యుటీ దక్కుతుందనుకుంటే రాష్ర్ట ప్రభుత్వం అందులో కోతపెట్టి దొంగదెబ్బ తీసింది. ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఇచ్చే గ్రాట్యుటీని రు.10 లక్షలకు పరిమితం చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దీనిపై ఈ నెల 2వ తేదీన విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం బైటపెట్టారు.
ఉద్యోగులకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. పది లక్షలుగా నిర్ణయించామని, దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిలో కోతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ‘ఇక గ్రాట్యుటీ వంతు’ శీర్షికన గత వారం ‘సాక్షి’ వార్త ప్రచురించిన విషయం విదితమే. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీగా రూ. 12 లక్షలు ఇవ్వాలని పదో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సు చేసింది. ప్రస్తుతం గ్రాట్యుటీ రూ. 8 లక్షలుగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ సిఫార్సులను పట్టించుకోకుండా రూ. 10 లక్షలకు పరిమితం చేసింది.
తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ గ్రాట్యుటీ రూ. 6 లక్షలు ఇవ్వాలని సిఫార్సు చేయగా అప్పటి ప్రభుత్వం అదనంగా మరో రెండు లక్షలు పెంచుతూ గ్రాట్యుటీ రు. 8 లక్షలుగా ఖరారు చేసింది. వాస్తవానికి గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 15 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే కనీసం పీఆర్సీ సిఫార్సు చేసినట్లుగా రూ.12 లక్షలైనా ఇవ్వకుండా రూ.10 లక్షలకు కుదించడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రాట్యుటీని పరిమితం చేయడంపై సచివాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగి స్పందిస్తూ నిజాయతీగా పనిచేసే వారి కడపు కొట్టడం అంటే ఇదేనన్నారు.
ఈ నిర్ణయం చూస్తుంటే ఇతర సంపాదనలపై దృష్టిపెట్టాలని పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యోగులకు సూచిస్తున్నట్లుగా ఉందని ఆ ఉద్యోగి వ్యాఖ్యానించారు. నిజాయతీగా పనిచేసే ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంత జీవితం సాగించడానికి గ్రాట్యుటీ ఎంతో దోహదపడుతుందని, అలాంటి గ్రాట్యుటీని తగ్గించడం అన్యాయమని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీని పీఆర్సీ సిఫార్సుల మేరకు రూ. 12 లక్షలుగా ప్రకటించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పీఆర్సీ సిఫార్సులను పట్టించుకోలేదు. మరోవైపు గ్రాట్యుటీపై గత కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచడం విశేషం. గ్రాట్యుటీని పరిమితం చేయడం వల్ల 30 ఏళ్ల సర్వీసు గల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులందరూ లక్షల్లో నష్టపోనున్నారు.
ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ: యనమల
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ త్వరలోనే ఇస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఒక డీఏ ఇవ్వాల్సి ఉంది. అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మరో డీఏ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక డీఏ మాత్రం ఇస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి చెప్పారు. అయితే రెండో డీఏ ఇస్తారా లేక ఎగనామం పెడతారా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. మరో పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇప్పటికే ఏడు వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటులో ఉందని యనమల తెలిపారు.
ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయింపులకన్నా అదనంగా పది వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ఆయన వివరించారు. బడ్జెట్ కేటాయింపులకన్నా అదనంగా ఒక్క పైసా అడగవద్దని, ఖర్చులను తగ్గించుకోవాల్సిందిగా అన్ని శాఖలకు లేఖలు రాయనున్నామని ఆయన చెప్పారు. అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని ఆర్థికమంత్రి చెప్పారు. ఎక్సైజ్, వ్యాట్‌లో అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం లెవీ విధానం ఎత్తివేయడంతో కూడా వ్యాట్ ఆదాయానికి గండిపడిందని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీలో భాగంగా కేంద్రం రు. 2,300 కోట్లు ఇచ్చిందని, ఇంకా రు. 12,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు. అటవీ, గనుల రంగాల ద్వారా ఆదాయం బాగా వస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్‌పై ఈ నెల 22వ తేదీన మంత్రుల కమిటీ సమావేశమై చర్చిస్తుందన్నారు.
నాడే జేఏసీ స్పందించి ఉంటే..
గ్రాట్యుటీ గరిష్ట పరిమితిపై ఉద్యోగులను ప్రభుత్వం దొంగదెబ్బ తీయబోతున్న విషయాన్ని గతవారమే సాక్షి బైటపెట్టింది. ఆ వెంటనే ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వం స్పందించి ఉంటే.. ప్రభుత్వం వెనకడుగు వేసేదేమో! కానీ జేఏసీ నాయకులు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. సాక్షాత్తూ ఆర్థిక మంత్రే ఈ విషయాన్ని స్పష్టం చేసినా కూడా జేఏసీ నాయకులు మౌనం వహించారు. జేఏసీ ప్రతినిధిబృందం మంగళవారం ఆర్థికమంత్రిని కల సిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం మీద అసంతృప్తిని కూడా ప్రకటించకుండా, మీడియా తో మాటమాత్రం కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి నిష్ర్కమించడం గమనార్హం.
ఉద్యోగుల వ్యతిరేక వైఖరి స్పష్టం
అనుమానాలు నిజమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందని స్పష్టమయింది. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 15 లక్షలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రూ. 12 లక్షలకు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం రూ. 10 లక్షలకే పరిమితం చేయడం, అలవెన్స్‌లకూ కోత వేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన వాటినీ ఆర్థిక ఇబ్బం దులు ఉండటం వల్ల ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే పొదుపు చర్యలను ఉద్యోగులకే పరిమితం చేయడం ఎందుకు? ప్రభుత్వం దుబారా తగ్గించుకోకుండా.. ఉద్యోగుల విషయంలో కోతలు విధించడం ఆమోదనీయం కాదు.
- ఐ.వెంకటేశ్వరరావు, జేఏసీ సెక్రటరీ జనరల్, యూటీఎఫ్ అధ్యక్షుడు