
ప్రియురాలిపై వేట కొడవలితో దాడి
- తెగిపోయిన ఎడమ అరచెయ్యి
గుత్తి : అనంతపురం జిల్లా గుత్తిలో ప్రియురాలిపై ప్రియుడు వేటకొడవలితో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమె ఎడమ అరచెయ్యి తెగిపడింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు రోడ్డులోని బ్రిడ్జి సమీపంలో నివాసముంటున్న శివకు వైఎస్సార్‌జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన మహిళతో మూడేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్ధలు రావడంతో ఏడాది కిందట విడిపోయారు. అనంతరం మంచాలు అల్లేందుకు బత్తలపల్లికి వెళ్లిన శివకు అక్కడ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోఒకరికొకరు దగ్గరయ్యారు. తొమ్మిది నెలల కిందట ఆమెను శివ గుత్తికి తీసుకొచ్చి సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆమె ఇతరులతో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండటం, కొందరితో సన్నిహితంగా మెలుగుతుండటంతో సహించలేకపోయాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా ఆమెలో ఎటువంటి మార్పూ కనిపించలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒక అపరిచిత వ్యక్తితో ఇంటి వద్ద మాట్లాడుతున్న సమయంలో శివ గమనించాడు. కోపంతో ఇంటిలోని వేట కొడవలి తీసుకుని ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. లక్ష్మి ఎడమ అరచెయ్యి తెగిపడింది. తలకు బలమైన గాయమై మెదడు బయటకు వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌కు రెఫర్ చేశారు. ప్రియురాలిపై దాడి చేసిన అనంతరం ప్రియుడు శివ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ గౌడ్ చెప్పారు.