అనంతపురం క్రైం: బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు గ్రామంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డిలను టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. గ్రామ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి హత్యకు ప్రతీకారంగా అతని కుమారుడు నాగలింగేశ్వర్ రెడ్డి, అనుచరుడు పవన్‌కుమార్‌రెడ్డి ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
పాత కక్షల నేపథ్యం
రేగడికొత్తూరులో 2019 ఆగస్టు 13న మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, వెంకటరమణారెడ్డి మధ్య రస్తా విషయంలో గొడవ జరిగింది. దీంతో సోమిరెడ్డిపై వెంకటరమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్ రెడ్డి మొద్దుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సోమిరెడ్డి అదే నెల 14న ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వెంకటరమణారెడ్డి, అతని కుమారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య కక్షలు కొనసాగుతున్నాయి.
వాయిదాకు వెళ్తుండగా...
సోమిరెడ్డి హత్య కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు వెంకటరమణారెడ్డి , పెద్దకుమారుడు పుల్లారెడ్డి, రెండో కుమారుడు గరుడ శేఖర్ రెడ్డి పల్సర్ బైక్‌పై సోమవారం ఉదయం 9.30 గంటలకు రేగడికొత్తూరు నుంచి అనంతపురం కోర్టుకు బయలుదేరారు. ఈ విషయాన్ని ప్రత్యర్థులు పసిగట్టారు. మార్గమధ్యంలోని పామురాయి–సోములదొడ్డి మధ్య పెద్దమ్మ ఆలయ సమీపంలో బైక్‌ను వెనుక నుంచి టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ గాల్లోకి ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డి అపస్మారకస్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు రెఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని బెంగళూరుకు తీసుకెళ్లారు. వెంకటరమణారెడ్డి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సఫారీని కెనాల్‌లో తోసేశారు
ఢీకొన్న తర్వాత బైక్.. సఫారీ వాహనానికి అతుక్కుపోయింది. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక అది ఊడిపోయింది. వాహనంలో వెళితే పోలీసులకు దొరికిపోతామని భావించిన నిందితులు సఫారీని హైవే మీదుగా హెచ్చెల్సీ(ఇందిరానగర్) వైపునకు తిప్పారు. వాహనాన్ని రన్నింగ్‌లోనే ఉంచి.. వారు కిందకు దిగి దాన్ని కెనాల్‌లోకి తోసేశారు. స్థానికులు డయల్ 100కు సమాచారం అందివ్వడంతో డీఎస్పీ ప్రసాద రెడ్డి, సీఐ మురళీధర్ రెడ్డి, ఎస్‌ఐలు మహానంది, నాగమధు అక్కడికి చేరుకున్నారు. కెనాల్‌లో పడి ఉన్న వాహనాన్ని క్రేన్ సాయంతో బయటకు తీయించి..స్టేషన్‌కు తరలించారు. కాగా..సఫారీ వాహనాన్ని నాగలింగేశ్వర్ రెడ్డి ఇటీవల ఉరవకొండకు చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదుహత్యాయత్నానికి సంబంధించి నాగలింగేశ్వర్‌రెడ్డి, అతని అనుచరుడు పవన్‌కుమార్ రెడ్డిలపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
రేగడి కొత్తూరులో బందోబస్తు
తండ్రీకొడుకులపై హత్యాయత్నం నేపథ్యంలో రేగడి కొత్తూరు గ్రామంలో బుక్కరాయసముద్రం సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment