కాంట్రాక్టు అధ్యాపకులకు ‘షో’కాజ్
కాంట్రాక్టు అధ్యాపకులకు ‘షో’కాజ్
Published Wed, Dec 28 2016 10:35 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
ఎన్నికల హామీలకు గ్రహణం
చంద్రబాబు తీరుపై కాంట్రాక్టు అధ్యాపకుల ఆగ్రహం
షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు
రెగ్యులరైజ్ చేయాలని ఆందోళనలు
కాంట్రాక్టు అధ్యాపకులపై ప్రభుత్వం రెండు నాల్కల «ధోరణి అవలంబిస్తోంది. తమను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా దానిని అమలుచేయకపోగా తిరిగి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో కాంట్రాక్టు అధ్యాపకుల్లో ఆగ్రహాం పెల్లుబికుతుంది. మొక్కుబడిగా నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ నియమించి..రెగ్యులరైజ్‌పై తాత్సారం చేస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు, ఆమరణ దీక్షలు మిన్నంటాయి. - కంబాలచెరువు (రాజమండ్రి)
జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అత్యధికశాతం పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఉన్నారు. 40 జూనియర్ కళాశాలల్లో 352 మంది, 15 డిగ్రీ కళాశాలల్లో 90 మంది, మూడు పాలిటెక్నిక్ కళాశాలల్లో 22 మందితో కలిపి మొత్తం 464 మంది పని చేస్తున్నారు. వీరంతా 27 రోజులుగా విధులు బహిష్కరించి కలెక్టరేట్, ఇంటర్‌బోర్డు, ఆర్జేడీ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వీరిని క్రమబద్దీకరిస్తామని నాలుగో తేదీ ఫిబ్రవరి 2012న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో చంద్రబాబు ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు.
నష్టపోతున్న విద్యార్థులు
కాంట్రాక్టు అధ్యాపకుల దీక్షలు, ఆందోళనలతో విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలపై పడే ప్రభావముంది. ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ సమ్మెతో చంద్రబాబు ఆగ్రహాంతో ఉన్నారని మంత్రులు పలు ధపాలుగా చెప్పడంతో కాంట్రాక్టు అ«ధ్యాపకులు మండిపడుతున్నారు.
యనమల ‘యు’ టర్న్
కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన హామీని తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కాంట్రాక్టు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉద్యమ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కాకినాడలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసిన కాంట్రాక్టు అధ్యాపకులతో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని 60 ఏళ్ల వరకు ఎవరూ విధుల నుంచి తొలగించరని, ఉద్యోగభద్రత కల్పిస్తామని, వేతనాలు సవరిస్తామని చెప్పారు. దీనిపై ఈ నెల 26న తుదినిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
షోకాజ్ నోటీసులు జారీ
తీరా ఆశగా ఎదురుచూసిన కాంట్రాక్టు అధ్యాపకులు తుది నిర్ణయం ఏమిటో తెలిసేసరికి హతాశులయ్యారు. ఉద్యమాలతో తమను బ్లాక్ మెయిల్ చేయలేరని, దీనికి తాము భయపడేదిలేదంటూ దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందరికీ మంగళవారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నాలుగు యూనియన్లు ఉండగా వారిలో విబేధాలు కల్పిస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. అంతేకాక ఆర్జేడీలు, ఇంటర్‌బోర్డు అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో బెదిరింపు చర్యలకు పూనుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమని వారు అంటున్నారు. దీనికితోడు కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని వారు కనిపించిన నాయకులందరినీ కాళ్లువేళ్లూ పట్టుకుంటున్నారు.
Advertisement
Advertisement