సిద్దిపేట తాగునీటి పథకం మ్యాప్
- సిద్దిపేట నీటిపథకం స్ఫూర్తిగా మిషన్ భగీరథకు రూపకల్పన
- సాకారం కానున్న సిద్దిపేట రైల్వే మార్గం
- ఈ రెండింటికీ సిద్దిపేటతో బంధం
సిద్దిపేట జోన్: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం నాటి గజ్వేల్ మండలం కోమటిబండ పర్యటనలో సిద్దిపేట మార్క్ కన్పిస్తోంది. జిల్లాకు చెందిన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ మార్గానికి శంకుస్థాపనతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించనున్నారు.
ఈ రెండు కార్యక్రమాలకు సిద్దిపేటకు దగ్గరి సంబంధం ఉంది. నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించే దిశగా చేపట్టిన గ్రామీణ శాశ్వత మంచి నీటి పథకాన్ని చేపట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేశారు. మరోవైపు గత మూడు దశాబ్దాలుగా సిద్దిపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం రైల్వేలైన్. మార్గానికి మోదీ శంకుస్థాపన చేయడం ద్వారా మరింత మోక్షం లభించనుంది.
రైల్వేలైన్ మూడు దశాబ్దాల కల
సిద్దిపేట రైల్వేలైన్ ఈ ప్రాంత వాసుల మూడు దశాబ్దాల నాటి కల. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాం నుంచి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకు సిద్దిపేట నియోజకవర్గ ప్రజల్లో బలంగా నాటుకున్న రైల్వేలైన్ ఆశలకు ఆదివారం నాటి ప్రధాని పర్యటనతో కొంత బలం చేకూరిందనే చెప్పాలి. హైదరాబాద్, కరీంనగర్‌లకు అనుసంధానంగా తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి సిద్దిపేట మీదుగా రైల్వేమార్గాన్ని అనుసంధానం చేస్తూ 1999లో కేంద్ర ప్రభుత్వానికి రూ.328 కోట్లతో 151 కిలోమీటర్ల ప్రతిపాదనలతో నూతన మార్గానికి ఓ అడుగు పడింది.
ఈ క్రమంలోనే 2005లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి అంకురార్పణ జరిగింది. సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న సిద్దిపేట రైల్వేలైన్ మార్గం భవిష్యత్తులో మరింత వేగవంతంగా ముందుకు సాగి సిద్దిపేట వాసుల మూడు వసంతాల కలకు మార్గం మరింత సుగమమైందనే చెప్పాలి.
సిద్దిపేట పథకం రాష్ట్రానికే ఆదర్శం
తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్న సిద్దిపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చింది మానేరు మంచినీటి పథకం. ఈ పథకం నుంచే మిషన్ భగీరథకు రూపకల్పన జరిగింది. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి వ్యయప్రయాసాలకోర్చి 58 కిలో మీటర్ల దూరంలోని ఎల్‌ఎండీ ద్వారా నియోజకవర్గంలోని 144 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేసి పథకానికి శ్రీకారం చుట్టారు.
నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు సమీపంలోని దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాలకు, సిద్దిపేట మున్సిపల్‌కు నిత్యం మానేరు నీటిని అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సత్ఫలితాలను అందిస్తున్న సిద్దిపేట మానేరు నీటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతిలో నీటిని అందించేందుకు మిషన్ భగీరథకు రూపకల్పన చేశారు. అందులో తొలి ప్రయోగంగా గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథను అమలుకు శ్రీకారం చుట్టారు.
సిద్దిపేటకు గర్వకారణం
నాడు సిద్దిపేట ముద్దబిడ్డగా కేసీఆర్ ఈ నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన తాగునీటి పథకం నేడు రాష్ట్రానికి మిషన్ భగీరథ రూపంలో ముందుకు రావడం గర్వకారణం. తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి తాగునీటిని అందించే లక్ష్యం ఎంతో గొప్పది. అదే విధంగా సిద్దిపేట వాసుల చిరకాల స్వప్నం రైల్వేలైన్ మార్గానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం శుభసూచకం. రైల్వేమార్గం పనులు వేగవంతానికి ప్రధాని పర్యటన దోహదపడనుంది. ఆదివారం నాటి కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన రెండు మహత్తర కార్యక్రమాలకు చోటు లభించడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అనందం. - హరీశ్‌రావు, రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి